Monday, July 28, 2014

మానవ ధర్మం - Oct'13 Editorial Veenaapaani - First cut

నేను ఆ మధ్య ఒక కథ విన్నాను. ఒక యజమాని తను కట్టిస్తున్న ఒక భవనం పదో అంతస్తునుంచి కింద నున్న ఒక పనివాణ్ణి పిలుస్తాడు. అక్కడ జరిగే పని శబ్దాల వాళ్ళ వాడికి యజమాని పిలుపు వాడికి  విన రాలేదు. అప్పుడు ఆయన వాడి దృష్టి ని ఆకర్షించడానికి ఒక పది రూపాయల కాగితం క్రింద కు వేస్తాడు. ఆ పనివాడు అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకుని తన పని కొనసాగిస్తాడు. అప్పుడు యజమాని, వంద రూపాయలు, మరో సారి ఐదు వందల రూపాయలు విసురుతాడు, అయినా  అదే ఫలితం . పనివాడు అవి తీసుకుని జేబులో వేసుకుని తన పని తాను సాగిస్తాడు. దాంతో యజమాని ఒక చిన్న రాయి తీసుకుని ఆ పనివాడి వైపు సరిగ్గా గురిచూసి కొడితే అది వాడి తలకు తగిలి, వాడు ఆ దెబ్బకు పైకి చూసి యజమాని చెప్పిన పని చేస్తాడు. ఇది చాల చిన్న కథ కాని ఎంతో ఆలోచించ చేసే కథ.  మనిషి జీవితానికి చక్కగా అమిరే కథ.  

 ఆ భగవంతుడు పైనుంచి మనకు ఎన్నో రకాల సౌకర్యాలుఆనందాలు, ఆశీర్వాదాలు  ఇస్తూ మనతో అనుబంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుంటే, మనం మాత్రం అవన్నీ అందిన మూలాలను మరిచి, ఐహిక సుఖాల మాయల్లో, యాంత్రిక జీవన ఒరవడిలో పడి పోయి, కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేయకుండా ఆ దేవుడిని గుర్తించడం మర్చిపోతాం. అప్పుడు ఆ భగవంతుడు కష్టాలనే మొట్టి కాయలు వేస్తే బుద్ది తెచ్చుకుని మళ్ళీ ఆ దేవుడి  చరణాలను ఆశ్రయిస్తాం. మనకు ఈ బతుకులో అందే ప్రతి దానికి ఆ భగవంతుడికి అడుగడుగునా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అప్పుడే కష్టాలనే రాళ్ల దెబ్బల బారి నుంచి మనల్ని మనం రక్షించు కొనగలమని ఈ కథ చదివినప్పుడు నాకు అనిపించినది.

అయితే భగవంతుడు కేవలం గుళ్ళల్లో ఉండే విగ్రహం మాత్రం కాదు.  మన చుట్టూ ఉండే ప్రకృతి అందులోని ప్రాణులుకృతజ్ఞతలు తెలపడమంటే వేలు ఖర్చు పెట్టి చేసే క్షీరాభిషేకాలూ కాదు. అవే పాలు పోసి తీర్చే  ఆకలి. ప్రసాదంగా మనం సమర్పించే అన్న ఫలాలు నిలపెట్టే ప్రాణాలు మనకిచ్చే దీవెనలు. మనం సమయానికి చేసే మాట సాయం, ఒక  ఆప్యాయమైన పలకరింపుఒక చిరునవ్వుతో ఇచ్చే ఒక పువ్వు కూడా, ఒకో సారి ఎన్నో జీవితాల్ని నిలపెట్టవచ్చు.

అందుకే మనకు అందిన దాంట్లో ఎంతో కొంత ధర్మబద్ధంగా దానం చేయాలి. అది అన్నార్తుల ఆకలి తీర్చాలి, అవసరాల్లో ఉన్నవారికి బాసట కావాలి. అప్పుడే అ భగవంతుడు హర్షిస్తాడు, నిన్ను తన వాడిగా చేసుకుంటాడు. ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు.  పునీతుడ్ని చేస్తాడుఅప్పుడే నీ  జీవితం సార్థకం అవుతుంది.  

అయితే దానం చేయడం ఎంత ముఖ్యమో అపాత్ర దానం అంత దోషము. దానము తీసుకునే వాడు కూడా అర్హుడు, అవరరార్తుడై ఉండాలి. లేక పోతే అది కడలిపై కురిసిన వాన లాంటిదవుతుంది.  పట్ట పగలు వెలిగించిన దివిటీ అవుతుంది. అందుకే నిర్మలమైన మనసుతో చేసే సాయం  అమృతం కన్నా శక్తి వంతమైనది. దానం మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో తిరిగి ఆశించకుండా ఉండాలి. మనకు ఉన్నంతలో చివరి నిముషం చివరి ముద్దా వరకు దానం చేసే అవకాశాన్ని కోల్పోకూడదు.

బహుశా అందుకే ఏది తిన్నప్పుడైనా నోటితో సగం కొరికి తినకూడని, ముఖ్యంగా దేవుడి ప్రసాదం కొద్ది కొద్దిగా త్రుంచుకొని తినాలని, అప్పుడు అది చివరి వరకు ఎవరికైనా పెట్టె అవకాశం చివరివరకు ఉంటుందని  పెద్దలు చెబుతారనుకుంటా.  ఒక చెట్టుకి నువ్వు రోజు ఒక కుంచెడు నీళ్ళు పోస్తే అది నీ కుటుంబానికి ఎన్నో రోజులకు సరిపడా ఫలాలనిస్తుంది. నీవు వేసే ఒక్క గడ్డి పోచకు ఆ గోవు అమృత తుల్యమైన పాలనిస్తుంది. అలాగే నీవు చేసే చిన్న దానమే నీకు జీవితంలో వర దానమై ఫలమిస్తుంది.

మనకు ఆకలికి మించి అన్నం తింటే ఎలాగైతే అజీర్తి అవుతుందో సంపద కూడా అది అవసరాన్ని మించి ఉంటే మనకు, అనారోగ్యం, అపాయం కలిగిస్తుంది. ఇంట్లో సంపద పెరిగినప్పుడు, మరియు పడవలో నీరు నిండినప్పుడు నీ రెండు చేతులతో దానిని బయటకు తోడి వెయ్యమన్న భక్త కబీర్ మాటల్లో ఎంతో  జీవన వేదాంతం ఉంది. అవసరాన్ని మించిన సంపద మనిషిని ఎలా ముంచేయగలదు అన్న జీవన సత్యాన్ని ఇంతకన్నా సూటిగా చెప్పగలమా?


శుభస్య శీఘ్రం

No comments:

Post a Comment