Monday, July 15, 2013

మౌన సాక్షివా? - July'13 editorial veenapaani first cut

మౌన సాక్షివా?

భారతదేశం ధర్మభూమి. కర్మభూమి కూడా.. హిందువుల్ని నడిపిస్తున్న ఆ సనాతన ధర్మం ఎప్పుడు తప్పు దోవ పట్టినా ఆ పరమాత్ముడు తన అస్తిత్వాన్ని, శక్తిని మనకు రుచి చూపిస్తాడు. కాని ప్రతి సారి తప్పు చేసిన వారే  శిక్షించబడతారా  అంటే చెప్పడం కష్టం. ఆ భగవంతుడి లెఖ్క మానవ మాత్రులమైన మనకు అర్థం కాదు. అవి ప్రకృతి వైపరిత్యాలుగా మనకు అనిపించినా అవి మనకు ఎన్నో బాధల్ని, గాధల్నీ మిగులుస్తాయి. మనల్ని కొన్ని సార్లు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రభావితం చేస్తాయి . ఇలాంటి ఎన్ని వేదాంత పరమైన సంజాయిషీలు చెప్పుకున్నా మొన్న జరిగిన  కేదార నాథ్ ఘటన మాత్రం ప్రతి మానవ మాత్రుడు జీర్ణించుకోలేని, ఒక్కసారి ఉలిక్కిపడ్డ సంఘటన. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయుల్ని, జీవనాధారాన్ని కోల్పోయిన హృదయ విదార ఘటన.    ప్రకృతి కన్నెర్ర చేసి తన ప్రతాపం తో ప్రళయం సృష్టిస్తే, మనమంతా చేష్టలుడిగి పోయి దిగ్భ్రాంతి చెందాం. టీవీల్లో సినిమా చూచినట్టు చూసి, రెండు రోజుల్లో మరిచిపోయాo. మరికొంతమందిమైతే ఇలాంటి  తీర్థ యాత్రలు ఇక జీవితంలో చేయకూడదని నిర్ణయం కూడా  తీసేసుకున్నాం. ఇంకా ఎందరో, ఇది జరిగింది కేదార నాథ్ లో కదా, మన అమరనాథ్ యాత్ర కి ఈ ఇబ్బంది ఉండదులే అని ముందుకు సాగిపోయారు. వర్షాలు నెల రోజుల ముందే వచ్చాయో, లేదా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నట్టు ఏదో ఒక  జలవిద్యుత్తు సంస్థ వారు  అక్కడి ప్రజల నమ్మకానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఆనకట్ట కట్టడానికి అక్కడి  ధారీ దేవి అమ్మవారి  (కాళీ మాత స్వరూపమని ఉవాచ )  దేవాలయ స్థల మార్పిడి వ్యవహారం  వల్ల ప్రాప్తించిన దోషం చేతనైతేనేమీ, అక్రమంగా నదీ పరివాహకంలో కట్టిన కట్టడాల వల్లనైతేనేమీ   జరగకూడని ఘోరం జరిగిపోయింది, తీరని జన నష్టం, ఆస్తి నష్టం జరిగినది. ఉత్తరాఖండ్  ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయినది. గంగమ్మ తల్లి వేయి అమాయక ప్రాణాల  సాక్షిగా తన ప్రక్షాళన చెసుకున్నది. ఎన్నో శవాలు సగం కాలి కాశిలో తనలో కలవకుండానే తనే తన కర్తవ్యాన్ని కసి తీరా తీర్చుకున్నది. ఎంతోమందికి జీవన్ముక్తి ని ప్రసాదించింది.  సాక్షాత్తు ఆ జగద్గురు ఆది శంకరులవారు కైవల్యప్రాప్తి పొందిన కేదారనాథ్ లో మోక్షం పొందారన్న ఒక్క ఓదార్పు తప్ప మనం వేరే ఇంకా ఏమి ఇవ్వగలం?. మహా అయితే ఒక రోజు జీతం ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్లు చేతులు దులుపుకోవడం తప్ప. అన్నట్టు, ధారిదేవి దేవి భాగవతంలో చెప్పిన నూటా ఎనిమిది శక్తిపీఠములలో ముఖ్యమైన పీఠమట. అలకానంద నది మధ్య ద్వీపంలో కొలువున్న ఈ శక్తి సాక్షాత్తు ఆ కాళీ స్వరూపమని, ఈ అమ్మవారు, ఒక రోజులో బాలికా, యవ్వనవతిగా, ముదుసలి ముత్తైదువ స్వరూపంలో దర్శనం ఇస్తుందని స్థలపురాణం. ఈ ద్వీపంపై ఉన్న దేవాలయంలో, దేవతామూర్తి కేవలం శరీర పైభాగం మాత్రమే విగ్రహంగా ఉందట. మిగతా భాగం రుద్ర ప్రయాగ్ జిల్లా లోని కాళీమఠములో శ్రీ చక్ర రూపంలో ఆ జగద్గురు శంకర భగవద్పాదులు ప్రతిష్టించారని స్థానికులు చెపుతారు. ధారీ దేవి చార్ ధామ్ ల క్షేత్ర రక్షకురాలని, ఆనకట్ట కట్టడం వల్ల ఈ దేవాలయం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఆ అమ్మవారి విగ్రహాన్ని మూలస్థానం నుంచి కదిలించే ప్రయత్నం చేయడంవల్ల నే  ఈ విపత్తు సంభవించిందని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఏది ఏమైనా ఆ పరమేశ్వరుడి  పుణ్యభూమి మరుభూమిని తలిపించింది. అ శివుడు మాత్రం గుళ్ళో చెక్కుచెదరకుండా మౌనసాక్షిగా యోగముద్రలో ఉండి పోయాడు. ఎంతైనా స్మశానమే శివుడి వాసం కదా. 1882 లో కూడా అప్పటి రాజు ఇలాంటి ప్రయత్నమే ఏదో చేస్తే, సరిగ్గా ఇలానే వరద ప్రళయం వచ్చిందని చెపుతున్నారు. ప్రతి ఏటా కొన్ని లక్షలమంది భక్తులు దర్శించుకునే చార్ ధామ్ యాత్ర ఈ సారి అందరికి చెడు జ్ఞాపకాలనే మిగిల్చినది. ఏమైనా భక్తులు కూడా తీర్తయత్రలా కాకుండా విహారయత్రాలుగా వీటిని భావించడం కూడా ఒక రకంగా విచారకరమేఇలా పుణ్యక్షేత్రాలు కూడా అభద్రతకి మారు పేరుగా మారిపోవడం నిజంగా శోచనీయం. అది ఇలాంటి విపత్తుల వల్ల కావచ్చు లేదా తీవ్రవాదుల విపరీత ధోరణుల వల్ల కావచ్చు.  ఒక స్వామి నారాయణ్ దేవాలయంపై దాడి, షిర్డిసాయి ప్రాంగణంలో బాంబు పేలుడు, ఈమధ్య జరిగిన బుద్ధగయలోని బాంబు పేలుళ్లు, ఎవైన, భక్తులు దైవదర్శనానికి కూడా భయంగా వెళ్ళాల్సి వస్తోంది. అన్నింటికీ మన హైదరాబాద్ లోనే మూలాలు. అన్నట్టు ఆ జలవిద్యుత్తు సంస్థ ప్రధానకార్యాలయం కూడా మన హైదరాబాదే నట. మనం అన్నింటా ఘన చరిత్ర గలిగినవాళ్ళం గదూ.
ఓ స్వామీ ఎందుకిలా జరుగుతుంది?. పవిత్రస్థలాల్లో మనుష్యుల అపవిత్ర ప్రవర్తన కారణంగా చూపుతావా?. అహింస పరమోధర్మ:అన్న  బుద్దుడి అనునాయులు, భూమిపై పాకే, జీవం ఉన్న ప్రతిజీవిని తింటున్నారు కాబట్టి అని సాకు చూపుతావా?. నేను పులితోలు కప్పుకుని, తిరిపెమునెత్తుకుని జీవిస్తే, మీరంతా జల్సాలు చేస్తూ, నాగరికత పేరుతో,నా యాగి చేస్తున్నామని సమాధానపరుస్తావా?, అయినా నాకెందుకులే, నన్ను నమ్మే భక్తులు నాకు ఎలాగు ఉన్నారని మా రాజకీయ నాయకుల లాగ, నీ పని నీవు చేసుకుపోతావా?. నీవు మౌనసాక్షివా, లేక మనసాక్షివైతావా?. స్వామీ మళ్లీ , నీ వెండి కొండని వదిలి దివినుండి భువికి దిగిరావాల్సిన సమయం అసన్నమైంది. నీ త్రిశూలంతో మా అరిషడ్వర్గాలను వధించి కనీసం మా రాబోయే తరాలనైనా భక్తీ,ముక్తి మార్గం వైపు పయనించేటట్టు వరం ఇవ్వవూ!!.

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః


---::-----

Thursday, May 16, 2013

వందే జగద్గురుo


వందే జగద్గురుo

    సాక్షాత్తు   పరమశివుని అంశావతారంగా భావింపబడే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు  స్థాపించిన నాలుగు ముఖ్యమైన  ఆమ్నేయ శంకర పీఠములు  తూర్పుభారతంలో గోవర్ధన పీఠము (ప్రజ్ఞానం బ్రహ్మ:), దక్షిణాన శృంగేరీ  శారదా పీఠము ( అహం బ్రహ్మాస్మి), పశ్చిమాన ద్వారక పీఠము ( తత్వమసి:) మరియు ఉత్తరాన జోషిమట్  పీఠము (అయమాత్మా బ్రహ్మ:). వీటితో పాటు  అతి ముఖ్యమైనది  కంచి కామకోటీ  పీఠము.   ఎనిమిదేళ్ళ వయసులో సన్యాసాన్ని స్వీకరించిన జగద్గురు ఆది శంకరులు కాలినడకన సంపూర్ణ భారత యాత్రానంతరం ఆ కామాక్షీదేవి సేవలో కంచిలోనే తన జీవితకాలాన్ని గడిపారట. కేవలం తన 32 వ వయస్సులోనే కేదారనాథ్ వద్ద శివకైవల్యం పొందారని కూడా చెపుతారు.  సుమారు  2500 సంవత్సరాల క్రితం (క్రీ. పూ. 482) స్థాపింపపడ్డ  ఈ పీఠము, ఇప్పటి వరకు  ఆచార్య పరంపరలో 69 జగద్ గురువులచే అవిఘ్నంగా  సేవించబడ్డ బహుశా ఏకైక పీఠము ఈ కంచి కామకోటి పీఠము. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించిన శంకర భగవత్పాదులు హిందూ మత తత్వానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అద్వైత వేదాంతాన్ని ప్రబొధించినా, ఉపనిషద్ సారాన్ని మనకందరికీ అందించిన ఈ మహానుభావుడు పుట్టినది, శుక్ల పంచమివైశాఖ మాసము, ఆనందనామ సంవత్సరం. గురు పౌర్ణమి కూడా ఈ రోజు ని జరుపుకుంటారు. బ్రహ్మసూత్ర భాష్యం, భజగోవిందం, శ్రీ శంకరులు మానవాళికి  అందించిన ముక్తి పథాలు. శాస్త్రం,యుక్తి, అనుభవం, కర్మ ఆధారంగా అద్వైత వేదాంతం ఆజన్మాంతం మానవుడిని  ఉన్నతమైన జీవన శైలికి ఒక మార్గాన్ని అన్వేషింప చేసే ఒక ఉపకరం.
శ్రీ శంకరాచార్యుల వారి జీవన క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం  స్వామివారి కైలాస యాత్ర. స్వామి తన యోగ శక్తి తో ఆదిదంపతుల దివ్యదర్శనం శివపదాది కేశాంత స్త్రోత్రం, శివకేశాది పదాంత స్త్రోత్రంతో శివపార్వతులను ప్రసన్నం చేసుకుంటే, స్వయంగా ఆ పరమ  శివుడే తాళ పత్ర్రాలపై రచించిన "సౌందర్యలహరి" ఇచ్చిన హృద్యమైన సన్నివేశం. ఆ పరమశివుడు ఆచార్యుల వారికి పంచ స్పటిక లింగాలతో కూడా ఆశీర్వదించేరుట. అవే శ్రీ శంకర భగవత్పాదుల వారు స్వయంగా ముక్తి లింగం కేదార్ నాథ్ లో, వర లింగం ప్రస్తుతం నేపాల్ లో ఉన్న నీలకంఠ క్షేత్రంలో, భోగ లింగం శృంగేరీ శారదా పీఠంలో, మరియు మోక్ష లింగంచిదంబరం తమిళనాడు లోని  నటరాజ స్వామి క్షేత్రం లో ప్రతిష్టించి, యోగ లింగాన్ని కంచి లో ప్రతిష్టించారు. 

ఆది శంకరులవారు ఆ పరమశివుడి అవతారమైతే, సాక్షాత్తు ఆ జగద్గురువు శంకర భగవద్పాదుల అవతారమే 68 పీఠదిపతి శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అని చెపుతారు. సుమారు వందేళ్ళు జీవించిన(1894-1994) ఈ జగద్గురు, 67వ స్వామి శ్రీ మహాదేవేంద్ర సరస్వతి స్వామి పీతాదిపత్యం స్వీకరించిన ఏడు  రోజుల్లోనే శివకైవల్యం పొందడంతో కేవలం పదమూడేళ్ళ వయసులోనే పీటాదిపత్యం స్వీకరించి, భారతదేశమంతా కాలి నడకన మరియు సాంప్రదాయ పల్లకిలోనే యాత్ర సాగించారు. నడిచే దేవుడు, మహాస్వామి అని ప్రఖ్యాతి పొందారు. విదేశీయులకు సైతం మన హిందూ ధర్మం ప్రచారం చేసి సమ్మోహితులను చేసిన పరమ యోగి ఈ మహస్వామి. స్వతంత్ర సమరం లో కూడా ప్రత్యక్షంగా విదేశీ వస్తు బహిష్కరణ లో పాల్గొన్న స్వామిజి, అద్వైత తత్వానికి విదేశాల్లో సైతం విస్తృత ఆదరణని  కల్పించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు తన డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథంలో ఆది శంకరుల వారిని  భారతదేశం పొందిన ఒక అద్భుతమైన మహాశక్తిగా వర్ణిస్తే, అవి అక్షరాల ఈ మహాస్వామిని కూడా నిర్వచిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ  లేదు.  మహాస్వామి కాలంలోనే కంచి పీఠం విశేషంగా ఆభివృద్ధి చెందింది. 

తరువాత స్వామి 69వ, ప్రస్తుత  పీటాధిపతి శ్రీ శ్రీ జగద్గురు జయేంద్ర  సరస్వతీ శ్రీపాద స్వామివారు.
శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి తన ధర్మ ప్రచారంతో అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్శించారు. ఎన్నో ధార్మిక, సాంఘిక సంస్కరణలను చేపట్టి, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగం, ఎన్నో దేవాలయాల పునరుద్ధరణలో ప్రత్యక్ష్య మార్పులకు కారణ భూతులయ్యారు. తన 63వ ఏట మానస సరోవర, మరియు కైలాశ్ గిరి  యాత్ర చేసిన ఏకైక స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. విశేష ధర్మ పరంపరతో అలరాడే కంచి కామకోటి పీఠం జగద్గురువులు తమ 60వ పీతాదిపత్య వార్షికోత్సవం మన ఆంధ్రప్రదేశ్లో, మెదక్ జిల్లా లో జరగడం మన అందరి పూర్వ జన్మ సుకృతం. అందునా స్వయంగా వారిచేతులమీదుగా జరిగిన ఆ స్వర్ణకంకణధారణ, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించిన భక్తుల జీవితాలు ధన్యం,ధన్యం,ధన్యం. 

ధర్మో రక్షతి రక్షితః

అవినయం అపనాయా, విష్ణో అమయ మనః
సమయ విషయ మృగ తృష్ట్నాం: భూతదయం విస్తారయ సంసార సాగరాతః