Monday, January 2, 2012

శరణా గతి - ఒక జీవన విధానం


శరణా గతిఒక జీవన విధానం  
నీ  జ్ఞానం పరిమితం. లోపభూయిష్టం. నీ సామర్థ్యం  అతి స్వల్పం.నీ జీవితం మరీ సూక్ష్మం. నీవు ఆలస్యాన్ని భరించలేవు. అందుకే నీకు పూర్తిగా అర్థం కాని విషయాలను కూడా నువ్వు సాధించాలని ప్రయత్నం చేస్తావు. ఘోర పరాజయాన్ని పొందుతావు. ఎంతో ఆలస్యంగా పరిస్థితిని అర్థం చేసుకుంటావు. ఫలితాన్ని తప్పించుకొనుటకు ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తావు. అవి ఎంత దూరమో, అనుభవించడం ఎంత కష్టమో తెలుసుకునే లోపే జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. నీ బాధ్యతల్ని నీవు నిర్వర్తించలేదు. సంఘ నియమాల్ని పాటించలేదు. ఎవరి అంచనాలను నీవు చేరలేదు.ఎవరి ఆశలు నీవు తీర్చలేదు. ఇప్పుడే ఈలోకంలోకి వచ్చ్నినట్టుంది.అప్పుడే జీవితపు చివరి మజిలి దగ్గరపడినట్టుంది.  స్థితిలో నీవు ఎవరిని తలుచుకుంటావు?. ఎవరు నీ సమస్యకు సమాధానం చెపుతారు?. అప్పుడు కేవలం నీకున్న ఒకే ఒక్క ఉపాయం ఏది?.

అదే  అన్ని లోకాలను రక్షించే  ఒకే ఒక్క శక్తి. నీకు అండగా నిలుస్తుంది.   అదే నీకు సర్వస్వం అవుతుంది.  శక్తికి నిన్ను నువ్వు సమర్పించుకో.  శక్తే భగవంతుడు. నీ బాధలన్ని తీర్చే బాధ్యత తీసుకున్న పరమ శక్తి. తన పంచాంగాలతో నిన్ను రక్షించే మహా శక్తి. ఇప్పుడు నువ్వు  భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడివి. ఎంతో దయగల  సౌందర్యవంతుడు   లోకం లోని అన్ని కష్టాలనుండి నిన్ను మానసికంగా దూరం చేసి నీకు ఆనందపు పారవశ్యాన్ని పొందేట్టు చేస్తాడు. నిన్ను  ఐహిక బంధాలనుండి విముక్తున్ని చేస్తాడు. అంతం లేని అవరోధాల బాధల్ని పటాపంచలు చేస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ఆనందాన్ని నీదిగా చేస్తాడు. నీతో పసి పాపవుతాడు. సర్వం నీవు తనలో మమేకమవుతావు. సంపూర్ణ అనుభవాన్ని ఆనందాన్ని పొందుతావు. అదే శరణాగతి. నీవు దక్క  వేరే లోకం లేదనే తాదాత్మ్య స్థితి. అక్కడ కన్నీళ్లు లేవు. గాయాలు లేవు. కుట్రలు కుతంత్రాలకు స్థానం లేదు. సర్వం బ్రహ్మ మయం. ఇదే భగవద్గీత శ్లోక సారం. ఇదే  అత్యంత ఉన్నతమైన శ్లోకం. 
"సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజఅహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"
మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  అదే మనమనే స్వర్గం. అదే లేనప్పుడు మనిషికి కలిగే బాధలే నరకం. నిన్ను అన్ని ఐహిక పాపాల  నుండి  విముక్తున్ని చేసి మోక్ష సాధనకు భగవద్గీత చూపిన ఉత్తమమైన మార్గం. నిన్ను నీవు భగవంతుడికి అంకితం చేసుకుని నీ కర్మ నీవు పాటించు. అంతా తానై నిన్ను తనలో ఐక్యం చేసుకుంటాడు. అదే కైవల్య మార్గం. ఖురాన్ బైబిల్ కూడా ఇదే విషయం తు  తప్పకుండా చెపుతాయి. మతం ఏదైనా సారం ఒక్కటే. అదే ఏదో ఒక శక్తికి నిన్ను శరణాగతి చేస్తుంది. అదే ప్రతి జీవికి, జీవితానికి పరమార్థం.