Tuesday, December 2, 2014

సేవే మార్గం



 
ప్రాణులు నరకంలో ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరిని ఆ ద్వారపాలకులు ఇలా అడుగుతారట.. ఓయి మానవా! నీవు పాపం కానీ తప్పు కానీ చేస్తున్నప్పుడు నీకు దైవం ముందుగా ఇచ్చే సూచనలు, హెచ్చరికలు అందలేదా ?". ఆప్పుడు ప్రతిఒక్కరు ఇచ్చే సమాధానం మాకు ప్రతిసారీ ఏదో ఒక సూచన ఖచ్చితంగా అందినా మేము ఆ ఐహిక మాయా మోహంలో పడి హెచ్చరికల్ని గ్రహించలేక పోయాము. అప్పుడు అప్రమత్తంగా ఉండి ఉంటే ఇప్పుడు నరకవాసం తప్పేది కదా అని బాధపడతారట.

 

ఇది నిజానికి మహమ్మదీయుల పవిత్ర ఖురాన్ నందు వ్రాయ బడ్డ ఒక వాక్యం. చెప్పిన గ్రంథం యేదైనా అది మనందరికి కూడ సరిపోయే చేదు నిజం. ఆలోచిస్తే ఇది ఎంత గొప్ప వాక్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో మనకు ఇలాంటి ఎన్నో సూచనలు భగవంతుడు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాడు. అది మన తల్లితండ్రుల రూపంలొ కానీ  పెద్దల ద్వారా కానీ లేదా ఒక మంచి స్నేహితుడు ఇచ్చే సూచన ద్వారా కావచ్చు, అదీ కాక మనకై మనకు వచ్చే స్ఫురణలు కూడా  కావచ్చు.  వాటిని గుర్తించే జ్ఞానాన్ని ఇచ్చాడు కాని మనం మన ఈ యాంత్రిక జీవనంలో పడి వాటిని గుర్తించే శక్తిని కోల్పోతున్నాము.

 

మంచి చేసే వారిని ఆ దైవం ఎప్పుడూ ఇష్టపడతాడు. ఆందుకే మనకు మంచి నడవడికతో మెదిలే ప్రతి అవకాశాన్ని కల్పిస్తాడు. మనం చేయవల్సిందల్లా ఆ అవకాశాన్ని గుర్తించడం, దాన్ని ఖచ్చితంగా పాటించడం. అడుగడుగునా మనల్ని పర్యవేక్షించడానికి ఎన్నో ఏర్పాట్లు ఆ దైవం ముందుగా తల్లిదండ్రుల రూపంలో, ఎదిగే కొద్దీ మనకు మంచి స్నేహితుల రూపంలో, గురువుల రూపంలో, శ్రేయోభిలాషుల ద్వారా కల్పిస్తాడు. వీటన్నికన్నా ముఖ్యమైనది మన మనస్సు మనకు ఇచ్చే హెచ్చరికలు. వాటిని మనం సవ్యంగా సరైన సమయంలో గ్రహించాలంటే మానవుడు గొప్ప సాధన చేయాలి. ఇది  నిత్య దైవ స్మరణ, సజ్జన సాంగత్యం, పెద్దలకు మనం చేసే  సేవ, ఆపన్నులకు చేసే ఏ చిన్న సాయం ఐనా చాలు. మనకు ఎంతో  మేలు చేస్తుంది.. ఆ దైవానికి దగ్గర చేస్తుంది. మిగతావన్ని మనతో ప్రతి క్షణం ఉండవు కాని మన మనస్సు మనకు ఒక గొప్ప రక్షణ కవచం. మంచీచెడు సంతులనంలో మంచి ఖాతా పెంచుకుందాం. ఆ నరకానికి దూరంగా పోదాం.

 

నా ఉద్దేశ్యంలో భగవంతుడు మనం ఎంతో ఖర్చుపెట్టి చేసే క్షీరాభిషేకాలు, సువర్ణపుష్పార్చనల కన్నా, అవసరంలో ఉన్న ఒక వికలాంగుడికి అందించే ఆపన్న హస్తం, ఒక పేదవాడికి చేసే చిన్న సాయం ఎక్కువగా హర్షిస్తాడు. ఆందుకే పెద్దలు దేవుడంటే సాయం అన్న అర్థం కూడా చెప్పారు. మనం  చెసే మంచి మనకు ఏదో రూపంలో ముఖ్యంగా మనకు యెదో ఆపద వచ్చినప్పుడు ఒక సూచన లాగా సాయం చేస్తుంది. దాన్ని గుర్తించే జ్ఞానాన్ని అందిస్తుంది. మనల్ని సరైన మార్గంలో ఆలోచించి యెక్కువ తప్పులు చేయకుండా చేస్తుంది. అలా వచ్చే ఏ అవకాశాన్ని దయచేసి మనం వదులుకోవద్దు.

 

శుభస్య శీఘ్రం