Saturday, January 29, 2011

సంకల్ప మాత్రేణ...........-అష్టకాల విద్యాచరణ్

ప్రతి పని ఒక సంకల్పముతో మొదలవుతుంది. సంకల్ప శుద్ధిని బట్టి దాని సిద్ధి ఆధార పడుతుంది. ఏ కార్యక్రమం అయినా మొదలెట్టేముందు మనసును ప్రశాంతంగా ఉంచి ప్రవిత్రమైన ఆలోచనలతో మొదలెడితే అది తప్పక మంచి ఫలితాలనే అందిస్తుంది. అందుకే ఏ శుభకార్యం నైనా ఇష్ట దేవతారధనతో మొదలెడతారు. ఈ ప్రతి పూజ సంకల్పం చెప్పటంతోనే మొదలవుంది. అంటే దైవపూజతో మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అంతా శుభం జరుగుతుందని దాని ఉద్దేశ్యమేమో!!!. కాకపోతే కేవలం మొక్కుబడిగా ఏ కార్యక్రమం నిర్వహించినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. అందుకే పద్ధతి ఒకటే అయినా ఫలితాలు ఎంతోమందికి ఎన్నో రకాలు.


ఇదే విషయాన్ని మనం ఒక యజ్ఞం లో ఒక వ్యక్తి పాల్గొనడాన్ని బట్టి అన్వయిస్తే సరిగ్గా ఇదే భావన కల్గుతుంది. మనం కేవలం యజ్ఞంలో పాల్గొనడం అంటే అక్కడ భౌతికంగా ఉండడం సరిపోదు. మనసా కర్మణా మనల్ని మనం అక్కడ ప్రతిష్ట చేసుకుంటే ఆ ధర్మ కార్యంలో పాల్గొన్న ఫలం సంపూర్ణంగా లభిస్తుందని నా విశ్వాసం.


అయితే ఇదే నిజమైతే ఇన్ని యజ్ఞాలలో పాల్గొన్న మనకు ఎంత పుణ్యం లభించాలి?. లభించింది. కాని అది తెలుకునే జ్ఞానం రావాలంటే యజ్ఞం చేసిన ఫలితం కూడా పొందగలగాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎలా సాధ్యం కావొచ్చు అన్న ఆలోచన మనసు కుదిపేసింది. అప్పుడే ఈ చిన్ని భావన కలిగింది. కేవలం సంకల్ప మాత్రేన కృత త్రేతా యుగం లో వారు ఎన్నో అద్భుతాలు సాధించారు. ప్రతి యజ్ఞం దేవతర్చనతో ప్రారంభిస్తాం. అప్పుడు యజ్ఞకర్త యొక్క సంకల్పం చెప్పేప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ సంకల్పాన్ని మనసులో పవిత్ర భావనతో చెప్పుకుని యజ్ఞం పూర్ణాహుతి అయ్యేవరకు మనసులో దీక్షతో "శ్రీ సరస్వత్యై ఇదం నమః" అన్న మంత్రాన్ని ఎన్ని సార్లు వీలైతే (కనీసం వెయ్యి సార్లు) నిష్ఠ తో జపం చేస్తే ప్రతి ఒక్కరికి యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందే అన్న భావం నన్నుఇలా వ్రాయడానికి ప్రోత్సహించింది. ఇలా కనీసం ఒక పదకొండు యజ్ఞాలలో వరుసగా చేస్తే అద్భుత ఫలితాలు వచ్చి మనసు మరింత మంచి కార్యాలు చేయడానికి సిద్ధమవుందని నా గట్టి నమ్మకం. ప్రయత్నిద్దాం ఇది అందరికి ఉన్న సువర్ణావకాశం.


తమ సోమా జ్యోతిర్గమయా....