Monday, July 28, 2014

అకాల మృత్యు హరణం...- May'14 Veenapaani Editorial First cut

ఒక పండు అది మొత్తం పండక ముందు మనం చెట్టు నుంచి తెంపితే, ఆ తెగిన చెట్టు కొమ్మ నుండి ఒకటి రెండు చుక్కలుగా  కొంచెం రసం కారుతుంది. అది అ కొమ్మ తనలో ఒక భాగం అకస్మాత్తుగా విడిపోతున్నప్పుడు కార్చే కన్నీరుగా భావిస్తే,  అదే పండు సంపూర్ణంగా పండినప్పుడు దానం తట అదే రాలి కింద పడితే ఆ కొమ్మ మౌనంగా ఉండి పోతుంది. అదే సమయంలో ఆ రాలే పండు స్వచ్ఛందంగా పది మందికి ఆనందాన్ని అందించడానికి తను అంకితం అవుతుంది. 

సరిగ్గా ఈ వేదాంతమే మానవ జీవితాలకు అన్వయిస్తే, మానవుల్ని అతిగా బాధించే భయపెట్టే విషయం మృత్యువు. అందునా అది ఒక కుటుంబంలో అకాలంగా సంభవిస్తే దానివల్ల కలిగే బాధ, దాని వల్ల ఆ కుటుంబం పడే కష్టాలు చెప్పనలవి కావు. ఎన్నో సార్లు ఆ కుటుంబం చిన్నాభిన్నమై మిగిలిన వారికి చేదు జ్ఞాపకాలని మిగులుస్తుంది. అందుకే మనం దేవుణ్ణి ప్రార్థించే టప్పుడు, దైవ తీర్థం తీసుకునేటప్పుడు, చావు లేకుండా కోరకుండా , అకాల మృత్యు హరణం కావాలని కోరుతాం. అదే సంపూర్ణ ఆయుష్షు తో పోయేవాళ్ళని మహానుభావులుగా భావిస్తాం. అదే భారతీయ సంస్కృతిలో ఉన్న అత్యున్నత జీవన వేదాంతం. చెట్టుని  కూడా ప్రాణిగా భావించి పూజించే అద్భుత భావం. అదే మహా మృత్యుంజయ మంత్రమ్ యొక్క పరమార్థం. 

కేవలం ఋగ్వేదం లోనే కాక శుక్ల, కృష్ణ యజుర్వేదం లో కూడా ఉన్న ఈ మృత్యుంజయ మంత్రం (ఓం త్రయంబకం యజామహే...)  నిత్య పారాయణ మంత్రం. ఓ శివా!! నన్ను అన్ని బాధ్యత నుండి విముక్తుల్ని చేసినాక మృత్యువుని ప్రసాదించమని కోరడమే ఈ మంత్ర పరమోద్దేశ్యం. కాని పూర్తిగా మృత్యువు ని జయించాలని కానే కాదు. అందుకే ఈ మహా మృత్యుంజయ మంత్రమ్ ప్రాతస్మరణీయం. ప్రతి రోజు కనీసం మూడు సార్లు శాంతి మంత్రం తో పాటు దీన్ని జపించాలని పెద్దలు చెపుతారు.  

మనిషి తన బాధ్యతలను నిరాటంకంగా  నిర్వర్తించాలంటే, సంపూర్ణ ఆయుష్షుతో బాటు ఆరోగ్యకరమైన జీవితం కూడా కావాలి. మంచి ఆరోగ్యానికి మంచి నడవడిక, మంచి ప్రవర్తన ఎంతో అవసరము. సంచిత కర్మ, ప్రారబ్ద కర్మ మన ప్రస్తుత జీవన గమనాన్ని నిర్దేశించేవైతే, క్రియమణ  కర్మ మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది. అందుకే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఒకరికి చేసే మంచి మనకు మంచి ఫలితాలనిస్తే, మనం దుష్కర్మలు మనకు చెడు అనుభవాలను మిగులుస్తాయి. అవే మనం నిత్యం అనుభవించే పాప ఫలితాలు. వీటన్నిటి ప్రభావం మనపైన ఉండకూడదనే మనం ఆ దైవం పాదోదుకం తీర్థంగా పుచ్చుకొనేటప్పుడు మనం తలుచుకునే మంత్రంలో సర్వవ్యాధి నివారణమ్, సమస్త పాప క్షయకరమ్ అని చెపుతూ మనల్ని మనం పావనం చేసుకోవడం.  ఇది నా ఉద్దేశ్యంలో ఈ విధంగా మనం ఆ దైవానికి  మనం పవిత్రంగా ఉంటామని  చేసే ప్రతిజ్ఞ.   అంతే కానీ మనం ఎన్ని దోషాలు, పాపాలు చేసినా పరవాలేదని కాదు. 

అందుకే నిత్యం మనం ఏ కర్మ చేస్తున్నా  మనసులో ఆ దైవాన్ని నిత్యం స్మరిస్తుందాం. సంపూర్ణమైన శాంతి మనలో మన చుట్టూ, ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉందన్న స్పురణతో జీవితాన్ని గడుపుదాం. అందని కొమ్మకు నిచ్చెనలు  వేసి  జీవితాలను అర్థాంతరంగా ప్రశ్నార్థకం చేసుకోవద్దు. మనిషి జీవన పరమార్థం ఆ దైవశక్తి లో ఐక్యమవడం అని తెలిసి, అంత అ దైవేచ్చ అని తెలిసి కూడా ఆరాటపడవద్దు. 

సర్వే జనాః సుఖినో భవంతు: ఓం శాంతి: శాంతి: శాంతి:


…………………………………………ఇటీవలే కొంతమంది మన యజ్ఞ సమితి సభ్యుల కుటుంబాల్లో విషాదాల్ని నింపిన వారి ఆత్మలు శాంతించాలని ప్రార్థిస్తూ..

No comments:

Post a Comment