మనం సహజంగా భయస్తులం. సంపద ఉన్నప్పుడు చోరభయం. మంచి చేసేప్పుడు చెడు గూర్చి భయం. చెడుకి కూడా మంచి అంటే భయం. ఆనందానికి దుఃఖమనే భయం. తప్పుకు శిక్ష అనే భయమ్. ప్రేమకి ద్వేషం
అంటే భయం. భయమున్నా మనకు సంపాదించడం కోసం తాపత్రయం, ఆనందం పై ఆశ, మంచికై ఆలోచన, దొరక్కుండా తప్పు
చేయాలన్న తపన, ప్రేమలో మునిగిపోవాలన్న కోరికా తగ్గలేదు, తగ్గదు కూడా.. అది మానవుల జన్మహక్కు. అలాగే పాపం చెయ్యాలంటే దైవభీతి. అయినా
పాపం చెయ్యగలిగే అన్ని అవకాశాలను చాలా సామర్థ్యం తో వినియోగించుకుంటాం. దైవాన్ని
భక్తి పేరుతో ప్రసన్నం చేసుకునే బదులు కానుకల ద్వారా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాం.
కొన్నిసార్లు విజయం కూడా సాధిస్తాం. చేసిన పాపాలకు ఆలస్యపు రుసుము చెల్లించి
తప్పించుకున్నామని విర్రవీగుతాం.
దైవం మనలో ప్రతి ఒక్కరినీ
ఏదో ఒక ప్రయోజనం కొరకు ఈ ప్రకృతి లోనికి పంపించిన ఒక ఉత్కృష్ట
శక్తి. కాని మనం ఆ శక్తిని గుర్తించకుండా ఆ ప్రకృతిని అవహేళన చేస్తున్నాం. ఆ
దైవం మనకొరకు సృష్టించిన ఎన్నో సహజమైన వనరులని నాశనం చేసి మనం కృత్రిమంగా జీవిస్తున్నాము. ఆ బ్రతుకు పోరాటంలో మనకు అత్యంత అపురూపమైన బిడ్డలను కూడా అద్దె తల్లుల అండలో
వదిలి మనం కేవలం వారాంతపు తల్లి తండ్రులమయ్యి అక్కడికే అలసిపోతున్నాం. దైవారాధన, భక్తీ ఒక ఖరీదైన
వైద్యంగా మారిపోయాయి. మనం దేవుడి గాలిగోపురం కన్నా ఎత్తుగా
బ్రతుకుతూ భూమి గర్భాన్ని చీలుస్తూ అన్నకట్టలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ, కూలుస్తూ, మళ్లీ నిర్మిస్తూ, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం.
అందుకే మనకు ఆ విశ్వామిత్ర భంగం తప్పదేమో అనిపిస్తున్నది. దైవాన్ని మనం భక్తి
అనే మాయలో పడవేసి అదే అ దేవుడి బలహీనత అని తేల్చిన ప్రతిసారీ ఆ దైవం
మన బలహీతనల పైన దెబ్బ కొడుతుంది. అప్పుడే ప్రకృతి ఆ పంచభూతాల సాక్షిగా తన అస్తిత్వాన్ని కసితీరా
ప్రదర్శిస్తుంది. అది ఉగ్ర నదీ రూపంలోనైతేనేమి, లేదా ఉరికే రైలు
రూపంలోనైతే నేమిగాక, మనం సర్వస్వం అనుకున్న మన పేగులు దేవుడు
మొండి కత్తితో కోసి పడేస్తున్నాడు. ఆ బాల సరస్వతుల మృత్యు ఘోషని హారతులుగా, లేత రక్త మాంసాలను నైవేద్యంగా స్వయం
కైంకర్యం చేసేసుకుంటున్నాడు. మన గుండెల బరువు పెంచి ప్రకృతిపై బరువు తగ్గిస్తున్నాడు. ఇవే కాక మనం గొప్పగా
నిర్మించుకున్న ఇంధన గొట్టాలు, ఎత్తుగా ఎగరేసిన గాలి విమానాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తున్నాయి. దీనికి పరిష్కారమే లేదా. రానున్న జీవితంలో ఇంకా ఎన్ని పెను మార్పులో.. ఇంకా ఎన్ని గుండె కోతలో.. తలుచుకుంటేనే ఎంతో భయం వేస్తోంది.
ఎందుకంటే మనం సహజంగా భయస్తులం కదా. అయినా మనిషి మారడు అతని కాంక్ష తీరదు.
దేవా, నేను ఈ మానవులందరి తరఫున నిన్ను కోరుకునే దొక్కటే. మా మనసులు మార్చే
మంత్రదండమై వచ్చి మమ్మల్ని ఈ కలిదోష పాప పంకిలం నుండి విముక్తులను చేయు స్వామీ!!
యదా
యదా హి ధర్మస్యా , గ్లానిర్ భవతి భారత:
అభ్యుత్థనమధర్మ్యస్య తదాత్మానం సృజామ్యహం
No comments:
Post a Comment