Thursday, May 16, 2013

వందే జగద్గురుo


వందే జగద్గురుo

    సాక్షాత్తు   పరమశివుని అంశావతారంగా భావింపబడే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు  స్థాపించిన నాలుగు ముఖ్యమైన  ఆమ్నేయ శంకర పీఠములు  తూర్పుభారతంలో గోవర్ధన పీఠము (ప్రజ్ఞానం బ్రహ్మ:), దక్షిణాన శృంగేరీ  శారదా పీఠము ( అహం బ్రహ్మాస్మి), పశ్చిమాన ద్వారక పీఠము ( తత్వమసి:) మరియు ఉత్తరాన జోషిమట్  పీఠము (అయమాత్మా బ్రహ్మ:). వీటితో పాటు  అతి ముఖ్యమైనది  కంచి కామకోటీ  పీఠము.   ఎనిమిదేళ్ళ వయసులో సన్యాసాన్ని స్వీకరించిన జగద్గురు ఆది శంకరులు కాలినడకన సంపూర్ణ భారత యాత్రానంతరం ఆ కామాక్షీదేవి సేవలో కంచిలోనే తన జీవితకాలాన్ని గడిపారట. కేవలం తన 32 వ వయస్సులోనే కేదారనాథ్ వద్ద శివకైవల్యం పొందారని కూడా చెపుతారు.  సుమారు  2500 సంవత్సరాల క్రితం (క్రీ. పూ. 482) స్థాపింపపడ్డ  ఈ పీఠము, ఇప్పటి వరకు  ఆచార్య పరంపరలో 69 జగద్ గురువులచే అవిఘ్నంగా  సేవించబడ్డ బహుశా ఏకైక పీఠము ఈ కంచి కామకోటి పీఠము. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించిన శంకర భగవత్పాదులు హిందూ మత తత్వానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అద్వైత వేదాంతాన్ని ప్రబొధించినా, ఉపనిషద్ సారాన్ని మనకందరికీ అందించిన ఈ మహానుభావుడు పుట్టినది, శుక్ల పంచమివైశాఖ మాసము, ఆనందనామ సంవత్సరం. గురు పౌర్ణమి కూడా ఈ రోజు ని జరుపుకుంటారు. బ్రహ్మసూత్ర భాష్యం, భజగోవిందం, శ్రీ శంకరులు మానవాళికి  అందించిన ముక్తి పథాలు. శాస్త్రం,యుక్తి, అనుభవం, కర్మ ఆధారంగా అద్వైత వేదాంతం ఆజన్మాంతం మానవుడిని  ఉన్నతమైన జీవన శైలికి ఒక మార్గాన్ని అన్వేషింప చేసే ఒక ఉపకరం.
శ్రీ శంకరాచార్యుల వారి జీవన క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం  స్వామివారి కైలాస యాత్ర. స్వామి తన యోగ శక్తి తో ఆదిదంపతుల దివ్యదర్శనం శివపదాది కేశాంత స్త్రోత్రం, శివకేశాది పదాంత స్త్రోత్రంతో శివపార్వతులను ప్రసన్నం చేసుకుంటే, స్వయంగా ఆ పరమ  శివుడే తాళ పత్ర్రాలపై రచించిన "సౌందర్యలహరి" ఇచ్చిన హృద్యమైన సన్నివేశం. ఆ పరమశివుడు ఆచార్యుల వారికి పంచ స్పటిక లింగాలతో కూడా ఆశీర్వదించేరుట. అవే శ్రీ శంకర భగవత్పాదుల వారు స్వయంగా ముక్తి లింగం కేదార్ నాథ్ లో, వర లింగం ప్రస్తుతం నేపాల్ లో ఉన్న నీలకంఠ క్షేత్రంలో, భోగ లింగం శృంగేరీ శారదా పీఠంలో, మరియు మోక్ష లింగంచిదంబరం తమిళనాడు లోని  నటరాజ స్వామి క్షేత్రం లో ప్రతిష్టించి, యోగ లింగాన్ని కంచి లో ప్రతిష్టించారు. 

ఆది శంకరులవారు ఆ పరమశివుడి అవతారమైతే, సాక్షాత్తు ఆ జగద్గురువు శంకర భగవద్పాదుల అవతారమే 68 పీఠదిపతి శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అని చెపుతారు. సుమారు వందేళ్ళు జీవించిన(1894-1994) ఈ జగద్గురు, 67వ స్వామి శ్రీ మహాదేవేంద్ర సరస్వతి స్వామి పీతాదిపత్యం స్వీకరించిన ఏడు  రోజుల్లోనే శివకైవల్యం పొందడంతో కేవలం పదమూడేళ్ళ వయసులోనే పీటాదిపత్యం స్వీకరించి, భారతదేశమంతా కాలి నడకన మరియు సాంప్రదాయ పల్లకిలోనే యాత్ర సాగించారు. నడిచే దేవుడు, మహాస్వామి అని ప్రఖ్యాతి పొందారు. విదేశీయులకు సైతం మన హిందూ ధర్మం ప్రచారం చేసి సమ్మోహితులను చేసిన పరమ యోగి ఈ మహస్వామి. స్వతంత్ర సమరం లో కూడా ప్రత్యక్షంగా విదేశీ వస్తు బహిష్కరణ లో పాల్గొన్న స్వామిజి, అద్వైత తత్వానికి విదేశాల్లో సైతం విస్తృత ఆదరణని  కల్పించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు తన డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథంలో ఆది శంకరుల వారిని  భారతదేశం పొందిన ఒక అద్భుతమైన మహాశక్తిగా వర్ణిస్తే, అవి అక్షరాల ఈ మహాస్వామిని కూడా నిర్వచిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ  లేదు.  మహాస్వామి కాలంలోనే కంచి పీఠం విశేషంగా ఆభివృద్ధి చెందింది. 

తరువాత స్వామి 69వ, ప్రస్తుత  పీటాధిపతి శ్రీ శ్రీ జగద్గురు జయేంద్ర  సరస్వతీ శ్రీపాద స్వామివారు.
శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి తన ధర్మ ప్రచారంతో అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్శించారు. ఎన్నో ధార్మిక, సాంఘిక సంస్కరణలను చేపట్టి, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగం, ఎన్నో దేవాలయాల పునరుద్ధరణలో ప్రత్యక్ష్య మార్పులకు కారణ భూతులయ్యారు. తన 63వ ఏట మానస సరోవర, మరియు కైలాశ్ గిరి  యాత్ర చేసిన ఏకైక స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. విశేష ధర్మ పరంపరతో అలరాడే కంచి కామకోటి పీఠం జగద్గురువులు తమ 60వ పీతాదిపత్య వార్షికోత్సవం మన ఆంధ్రప్రదేశ్లో, మెదక్ జిల్లా లో జరగడం మన అందరి పూర్వ జన్మ సుకృతం. అందునా స్వయంగా వారిచేతులమీదుగా జరిగిన ఆ స్వర్ణకంకణధారణ, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించిన భక్తుల జీవితాలు ధన్యం,ధన్యం,ధన్యం. 

ధర్మో రక్షతి రక్షితః

అవినయం అపనాయా, విష్ణో అమయ మనః
సమయ విషయ మృగ తృష్ట్నాం: భూతదయం విస్తారయ సంసార సాగరాతః