Saturday, September 17, 2011

ఒకింత వేకువ నాలో....


                                       


అవును.... ఒక సామాన్యుడిగా ఈ ప్రపంచంలో జరిగే మార్పులకు నేను మానసికంగా  సిద్ధంగా లేను. టీవీ సీరియల్లో కష్టాలకు కన్నీళ్ళు పెట్టె నేను నిజ్జంగా జరిగిన భూకంపం బాంబు పేలుళ్ళ వార్తలు మాత్రం ఒక నాటకము  చూసినట్టు చూస్తున్నాను. ఒక వేళ అదే మనం ఉన్న చోట జరిగితే నేను ఎలా ఎదుర్కోవాలో నేను ఆలోచించానా?. అసలు అవి ఎలా, ఎందుకు జరుగుతున్నాయి, వాటిని మళ్లీ జరగకుండా ఆపాలంటే మనం ఏమి చెయ్యాలి?. నాలో స్పందన శూన్యం. ఇవన్ని  నేను పాట్య పుస్తకాల్లో చదువుకోలేదు. ఎవరైనా అడిగినా ఏదో వార్తాపత్రికల్లో చదివిన జ్ఞానముతో  ఏదో సమాధానం చెపుతాము. అదంతా నిజమేనా...తెలియదు. ఒక సంఘటనకు వార్తను రాయాల్సింది బదులు, తమ అభిప్రాయాన్ని రాసే ఈ పత్రికలిచ్చే జ్ఞానం మనకు మేలు చేస్తుందా?.   మనకు ఏది పట్టదు. స్కాం జరిగితే గాని నాకు 2జి గురించిన జ్ఞానం రాలేదు. మనిషిగా మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా? ఆపోల్లో II చంద్రుడిపై అడుగు పెట్టి అప్పుడే 
ముప్పై ఏళ్ళు దాటి పోయింది. మళ్లీ అటువంటి ప్రయత్నం  ఎందుకు జరుగలేదు? ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకులకి దాని గూర్చి ఆలోచించే సామర్థ్యం, విజ్ఞానం, చదువు కావాలి.

ఈ ప్రపంచం మొత్తం అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, పేదరికం అనే నాలుగు పాదాల దౌర్భాగ్యం. పని చేసినందుకు ఇచ్చేది జీతం, పని అయ్యినందుకు ఇస్తే బహుమతి, అదే పని చేయడానికి ఇస్తే?    అన్న హజారే చెపితే కాని అది లంచమని తెలియదు. లంచగొండి తనం ఫై చట్టం రావాలంటే తనను నరకడానికి గొడ్డలినిచ్చె చెట్టంత అమాయకత్వం మన నాయకులకు  లేదు కదా.  మరి నేను ఎప్పుడు మేల్కొంటాను? నాలో వెలుగు ఎప్పుడు వస్తుంది? అవును ఒకింత వేకువ నాలో కావాలి.

దేవుడ్ని భయంతో, పాప భీతితో కాక భక్తితో కొలిచే రోజు రావాలి. కోరికలు తీరడానికి  కాక వాటిని తగ్గించడానికి నా ప్రార్థన జరగాలి. నేను చేసే దాన ధర్మం, పుణ్యం కోసం కాక, ఎదుటివాడి అవసరాన్ని బట్టి, మరియు ఆత్మ తృప్తి కోసం చేయాలి. నాలో సమూల మార్పు రావాలి. అంటే ఆధ్యాత్మికత భావం పెరగాలి.  అవసరాలు తగ్గించు కోవాలి. 
సామాన్యంగా జీవిస్తూ గొప్పగా ఆలోచించే వైఖరి నాలో పెరగాలి. అరిషడ్వర్గము తెగనరికే ఖడ్గం కావాలి. ఇలాంటి వేకువ కోసం నా ఎదురుచూపు. అసతోమా సద్గమయా...