Tuesday, December 2, 2014

సేవే మార్గం



 
ప్రాణులు నరకంలో ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరిని ఆ ద్వారపాలకులు ఇలా అడుగుతారట.. ఓయి మానవా! నీవు పాపం కానీ తప్పు కానీ చేస్తున్నప్పుడు నీకు దైవం ముందుగా ఇచ్చే సూచనలు, హెచ్చరికలు అందలేదా ?". ఆప్పుడు ప్రతిఒక్కరు ఇచ్చే సమాధానం మాకు ప్రతిసారీ ఏదో ఒక సూచన ఖచ్చితంగా అందినా మేము ఆ ఐహిక మాయా మోహంలో పడి హెచ్చరికల్ని గ్రహించలేక పోయాము. అప్పుడు అప్రమత్తంగా ఉండి ఉంటే ఇప్పుడు నరకవాసం తప్పేది కదా అని బాధపడతారట.

 

ఇది నిజానికి మహమ్మదీయుల పవిత్ర ఖురాన్ నందు వ్రాయ బడ్డ ఒక వాక్యం. చెప్పిన గ్రంథం యేదైనా అది మనందరికి కూడ సరిపోయే చేదు నిజం. ఆలోచిస్తే ఇది ఎంత గొప్ప వాక్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో మనకు ఇలాంటి ఎన్నో సూచనలు భగవంతుడు ఏదో ఒక రూపంలో అందిస్తూనే ఉంటాడు. అది మన తల్లితండ్రుల రూపంలొ కానీ  పెద్దల ద్వారా కానీ లేదా ఒక మంచి స్నేహితుడు ఇచ్చే సూచన ద్వారా కావచ్చు, అదీ కాక మనకై మనకు వచ్చే స్ఫురణలు కూడా  కావచ్చు.  వాటిని గుర్తించే జ్ఞానాన్ని ఇచ్చాడు కాని మనం మన ఈ యాంత్రిక జీవనంలో పడి వాటిని గుర్తించే శక్తిని కోల్పోతున్నాము.

 

మంచి చేసే వారిని ఆ దైవం ఎప్పుడూ ఇష్టపడతాడు. ఆందుకే మనకు మంచి నడవడికతో మెదిలే ప్రతి అవకాశాన్ని కల్పిస్తాడు. మనం చేయవల్సిందల్లా ఆ అవకాశాన్ని గుర్తించడం, దాన్ని ఖచ్చితంగా పాటించడం. అడుగడుగునా మనల్ని పర్యవేక్షించడానికి ఎన్నో ఏర్పాట్లు ఆ దైవం ముందుగా తల్లిదండ్రుల రూపంలో, ఎదిగే కొద్దీ మనకు మంచి స్నేహితుల రూపంలో, గురువుల రూపంలో, శ్రేయోభిలాషుల ద్వారా కల్పిస్తాడు. వీటన్నికన్నా ముఖ్యమైనది మన మనస్సు మనకు ఇచ్చే హెచ్చరికలు. వాటిని మనం సవ్యంగా సరైన సమయంలో గ్రహించాలంటే మానవుడు గొప్ప సాధన చేయాలి. ఇది  నిత్య దైవ స్మరణ, సజ్జన సాంగత్యం, పెద్దలకు మనం చేసే  సేవ, ఆపన్నులకు చేసే ఏ చిన్న సాయం ఐనా చాలు. మనకు ఎంతో  మేలు చేస్తుంది.. ఆ దైవానికి దగ్గర చేస్తుంది. మిగతావన్ని మనతో ప్రతి క్షణం ఉండవు కాని మన మనస్సు మనకు ఒక గొప్ప రక్షణ కవచం. మంచీచెడు సంతులనంలో మంచి ఖాతా పెంచుకుందాం. ఆ నరకానికి దూరంగా పోదాం.

 

నా ఉద్దేశ్యంలో భగవంతుడు మనం ఎంతో ఖర్చుపెట్టి చేసే క్షీరాభిషేకాలు, సువర్ణపుష్పార్చనల కన్నా, అవసరంలో ఉన్న ఒక వికలాంగుడికి అందించే ఆపన్న హస్తం, ఒక పేదవాడికి చేసే చిన్న సాయం ఎక్కువగా హర్షిస్తాడు. ఆందుకే పెద్దలు దేవుడంటే సాయం అన్న అర్థం కూడా చెప్పారు. మనం  చెసే మంచి మనకు ఏదో రూపంలో ముఖ్యంగా మనకు యెదో ఆపద వచ్చినప్పుడు ఒక సూచన లాగా సాయం చేస్తుంది. దాన్ని గుర్తించే జ్ఞానాన్ని అందిస్తుంది. మనల్ని సరైన మార్గంలో ఆలోచించి యెక్కువ తప్పులు చేయకుండా చేస్తుంది. అలా వచ్చే ఏ అవకాశాన్ని దయచేసి మనం వదులుకోవద్దు.

 

శుభస్య శీఘ్రం



 

Monday, July 28, 2014

అకాల మృత్యు హరణం...- May'14 Veenapaani Editorial First cut

ఒక పండు అది మొత్తం పండక ముందు మనం చెట్టు నుంచి తెంపితే, ఆ తెగిన చెట్టు కొమ్మ నుండి ఒకటి రెండు చుక్కలుగా  కొంచెం రసం కారుతుంది. అది అ కొమ్మ తనలో ఒక భాగం అకస్మాత్తుగా విడిపోతున్నప్పుడు కార్చే కన్నీరుగా భావిస్తే,  అదే పండు సంపూర్ణంగా పండినప్పుడు దానం తట అదే రాలి కింద పడితే ఆ కొమ్మ మౌనంగా ఉండి పోతుంది. అదే సమయంలో ఆ రాలే పండు స్వచ్ఛందంగా పది మందికి ఆనందాన్ని అందించడానికి తను అంకితం అవుతుంది. 

సరిగ్గా ఈ వేదాంతమే మానవ జీవితాలకు అన్వయిస్తే, మానవుల్ని అతిగా బాధించే భయపెట్టే విషయం మృత్యువు. అందునా అది ఒక కుటుంబంలో అకాలంగా సంభవిస్తే దానివల్ల కలిగే బాధ, దాని వల్ల ఆ కుటుంబం పడే కష్టాలు చెప్పనలవి కావు. ఎన్నో సార్లు ఆ కుటుంబం చిన్నాభిన్నమై మిగిలిన వారికి చేదు జ్ఞాపకాలని మిగులుస్తుంది. అందుకే మనం దేవుణ్ణి ప్రార్థించే టప్పుడు, దైవ తీర్థం తీసుకునేటప్పుడు, చావు లేకుండా కోరకుండా , అకాల మృత్యు హరణం కావాలని కోరుతాం. అదే సంపూర్ణ ఆయుష్షు తో పోయేవాళ్ళని మహానుభావులుగా భావిస్తాం. అదే భారతీయ సంస్కృతిలో ఉన్న అత్యున్నత జీవన వేదాంతం. చెట్టుని  కూడా ప్రాణిగా భావించి పూజించే అద్భుత భావం. అదే మహా మృత్యుంజయ మంత్రమ్ యొక్క పరమార్థం. 

కేవలం ఋగ్వేదం లోనే కాక శుక్ల, కృష్ణ యజుర్వేదం లో కూడా ఉన్న ఈ మృత్యుంజయ మంత్రం (ఓం త్రయంబకం యజామహే...)  నిత్య పారాయణ మంత్రం. ఓ శివా!! నన్ను అన్ని బాధ్యత నుండి విముక్తుల్ని చేసినాక మృత్యువుని ప్రసాదించమని కోరడమే ఈ మంత్ర పరమోద్దేశ్యం. కాని పూర్తిగా మృత్యువు ని జయించాలని కానే కాదు. అందుకే ఈ మహా మృత్యుంజయ మంత్రమ్ ప్రాతస్మరణీయం. ప్రతి రోజు కనీసం మూడు సార్లు శాంతి మంత్రం తో పాటు దీన్ని జపించాలని పెద్దలు చెపుతారు.  

మనిషి తన బాధ్యతలను నిరాటంకంగా  నిర్వర్తించాలంటే, సంపూర్ణ ఆయుష్షుతో బాటు ఆరోగ్యకరమైన జీవితం కూడా కావాలి. మంచి ఆరోగ్యానికి మంచి నడవడిక, మంచి ప్రవర్తన ఎంతో అవసరము. సంచిత కర్మ, ప్రారబ్ద కర్మ మన ప్రస్తుత జీవన గమనాన్ని నిర్దేశించేవైతే, క్రియమణ  కర్మ మన భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది. అందుకే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఒకరికి చేసే మంచి మనకు మంచి ఫలితాలనిస్తే, మనం దుష్కర్మలు మనకు చెడు అనుభవాలను మిగులుస్తాయి. అవే మనం నిత్యం అనుభవించే పాప ఫలితాలు. వీటన్నిటి ప్రభావం మనపైన ఉండకూడదనే మనం ఆ దైవం పాదోదుకం తీర్థంగా పుచ్చుకొనేటప్పుడు మనం తలుచుకునే మంత్రంలో సర్వవ్యాధి నివారణమ్, సమస్త పాప క్షయకరమ్ అని చెపుతూ మనల్ని మనం పావనం చేసుకోవడం.  ఇది నా ఉద్దేశ్యంలో ఈ విధంగా మనం ఆ దైవానికి  మనం పవిత్రంగా ఉంటామని  చేసే ప్రతిజ్ఞ.   అంతే కానీ మనం ఎన్ని దోషాలు, పాపాలు చేసినా పరవాలేదని కాదు. 

అందుకే నిత్యం మనం ఏ కర్మ చేస్తున్నా  మనసులో ఆ దైవాన్ని నిత్యం స్మరిస్తుందాం. సంపూర్ణమైన శాంతి మనలో మన చుట్టూ, ఈ విశ్వమంతా వ్యాప్తించి ఉందన్న స్పురణతో జీవితాన్ని గడుపుదాం. అందని కొమ్మకు నిచ్చెనలు  వేసి  జీవితాలను అర్థాంతరంగా ప్రశ్నార్థకం చేసుకోవద్దు. మనిషి జీవన పరమార్థం ఆ దైవశక్తి లో ఐక్యమవడం అని తెలిసి, అంత అ దైవేచ్చ అని తెలిసి కూడా ఆరాటపడవద్దు. 

సర్వే జనాః సుఖినో భవంతు: ఓం శాంతి: శాంతి: శాంతి:


…………………………………………ఇటీవలే కొంతమంది మన యజ్ఞ సమితి సభ్యుల కుటుంబాల్లో విషాదాల్ని నింపిన వారి ఆత్మలు శాంతించాలని ప్రార్థిస్తూ..

భగవంతుని కోసం- Editorial Veenaapaani Feb'14 First cut

అవును. నేను వెదుకుతున్నాను.  ఆయన కోసం వెదకని చోటు లేదు, ఎక్కని మెట్టు లేదు. కాని తృప్తి  లేదు. కేవలం విగ్రహాలూనిగ్రహం లేని మనసులు మాత్రమే కనిపించాయి. ఎందరినో అడిగాను. ఎంతోమంది గురువుల ప్రవచనాలు విన్నాను. ఒకరన్నారు, ఆయనంటే పరమాత్మ అనీ, ఆయన్ని ఎవరు సృష్టించలేదు కాబట్టి, అమరుడని, ఈ జగత్తులో జరిగే ప్రతిదానికి కారణ భూతుడని, సమయానికి అతీతుడని చెప్పారు. మరొకరన్నారూ! స్వయంగా ఆయనే చెప్పాడు కదా , మీరు ఆ అది శంకరుల "నిర్వాణ శతకం" చదువ లేదా?, నేను సప్తధాతువులు, పంచభూతాలు కాదు, పాప పుణ్యాలు కాదు, నేను మృత్యువును కాదు, మృత్యుభయాన్ని కాదునేను సఖుడను కాదు, బంధుడను కాదు, పాప పుణ్యాన్ని కాదు, నేను చిదానంద స్వరూపుడను. శివున్ని అని.  ఇంకొకరన్నారూ! మనం ఆయన ని ఎప్పుడూ చూడలేమని, కాని ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉంటుందని!! అవును నా ఈ నిరంతర శోధన, ఆ అనిర్వచనీయ సౌందర్యం కోసం.  నేను ఎదురుచూస్తున్నానుఅందరూ చెప్పుకునే ఆయన అద్భుతాలు దర్శించడం కోసం, మనశ్శాంతి కోసం, ఆ దేవుడి కోసం!. దైవత్వం కోసం! అద్వైతం కోసం.

భావం తెలిసింది. మట్టి పాత్రలు ఎన్నో రకాలు కాని అందులో ఉన్న మట్టి ఒక్కటేనని. ఆభరణాలకు ఎన్నో పేర్లు కాని అందులో ఉన్న బంగారం ఒక్కటే నని. అదే సత్యం.  మనుషులకెన్నొ రూపాలు కానీ వారిలో ఉన్న బ్రహ్మమొకటే నని. అదే శంకరాద్వైతమని. నీవు నేను వేరు కాదు అంతా వేరు వేరు రూపాలైన ఒకే తత్వాలని.

నాకు ఎప్పుడూ అనిపించేదేమిటంటే మనం చేసే మంచి, చెడు పనులన్నీ కూడా ఆ దైవత్వం ని గూర్చి చేసే శోధన లోని భాగమేనని, అయితే, మంచి పనులు మనల్ని దైవత్వానికి దగ్గరగా తీసుకెళ్తే  పనులు దూరం తీసుకెళ్తాయని. కాకపోతే మనకు ఒక జీవితం కాలం సరిపోదు ఆ జ్ఞానోదయం కలగడానికి. తెలిసో తెలియకో మనం చేసే చెడ్డ పనులే ఎక్కువ కాబట్టి. అయినా ఏదో లోటు తెలుస్తోంది. అసంతృప్తి తొలుస్తోంది.

కాని ఒక్కటి మాత్రం అర్థమైంది  దేవుడంటే ఇంకేదో ఉంది. అది తెలుకోవాలంటే ఇంకా శోధన కావాలి. భక్తి, కర్మ, కరుణ, జాలి, సౌభాతృత్వం, వైరాగ్యం, జ్ఞానం అనే పనిముట్లు ఇంకా తీక్షణంగా, దీక్షగా వాడాలని అర్థమైంది. దానికి ఇంకా చాల ఆత్మవిమర్శ, స్వయం ప్రక్షాళన అవరసరమన్న సత్యం తెలిసినది.  దానికి కావలిసిన మనో నిబ్బరం ఎలా సంపాదించాలన్నదే ఇప్పుడు ముందున్న ప్రశ్న. అప్పుడే అడుగడుగున గుడి, అందరిలో గుడి, ఆ గుడిలో దీపం కనిపిస్తుందని ఒక మిణుగురు ఆశ.


అసతో మా సద్గమయా, తమసోమా మా జ్యోతిర్గమయా

మానవ ధర్మం - Oct'13 Editorial Veenaapaani - First cut

నేను ఆ మధ్య ఒక కథ విన్నాను. ఒక యజమాని తను కట్టిస్తున్న ఒక భవనం పదో అంతస్తునుంచి కింద నున్న ఒక పనివాణ్ణి పిలుస్తాడు. అక్కడ జరిగే పని శబ్దాల వాళ్ళ వాడికి యజమాని పిలుపు వాడికి  విన రాలేదు. అప్పుడు ఆయన వాడి దృష్టి ని ఆకర్షించడానికి ఒక పది రూపాయల కాగితం క్రింద కు వేస్తాడు. ఆ పనివాడు అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకుని తన పని కొనసాగిస్తాడు. అప్పుడు యజమాని, వంద రూపాయలు, మరో సారి ఐదు వందల రూపాయలు విసురుతాడు, అయినా  అదే ఫలితం . పనివాడు అవి తీసుకుని జేబులో వేసుకుని తన పని తాను సాగిస్తాడు. దాంతో యజమాని ఒక చిన్న రాయి తీసుకుని ఆ పనివాడి వైపు సరిగ్గా గురిచూసి కొడితే అది వాడి తలకు తగిలి, వాడు ఆ దెబ్బకు పైకి చూసి యజమాని చెప్పిన పని చేస్తాడు. ఇది చాల చిన్న కథ కాని ఎంతో ఆలోచించ చేసే కథ.  మనిషి జీవితానికి చక్కగా అమిరే కథ.  

 ఆ భగవంతుడు పైనుంచి మనకు ఎన్నో రకాల సౌకర్యాలుఆనందాలు, ఆశీర్వాదాలు  ఇస్తూ మనతో అనుబంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తుంటే, మనం మాత్రం అవన్నీ అందిన మూలాలను మరిచి, ఐహిక సుఖాల మాయల్లో, యాంత్రిక జీవన ఒరవడిలో పడి పోయి, కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేయకుండా ఆ దేవుడిని గుర్తించడం మర్చిపోతాం. అప్పుడు ఆ భగవంతుడు కష్టాలనే మొట్టి కాయలు వేస్తే బుద్ది తెచ్చుకుని మళ్ళీ ఆ దేవుడి  చరణాలను ఆశ్రయిస్తాం. మనకు ఈ బతుకులో అందే ప్రతి దానికి ఆ భగవంతుడికి అడుగడుగునా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అప్పుడే కష్టాలనే రాళ్ల దెబ్బల బారి నుంచి మనల్ని మనం రక్షించు కొనగలమని ఈ కథ చదివినప్పుడు నాకు అనిపించినది.

అయితే భగవంతుడు కేవలం గుళ్ళల్లో ఉండే విగ్రహం మాత్రం కాదు.  మన చుట్టూ ఉండే ప్రకృతి అందులోని ప్రాణులుకృతజ్ఞతలు తెలపడమంటే వేలు ఖర్చు పెట్టి చేసే క్షీరాభిషేకాలూ కాదు. అవే పాలు పోసి తీర్చే  ఆకలి. ప్రసాదంగా మనం సమర్పించే అన్న ఫలాలు నిలపెట్టే ప్రాణాలు మనకిచ్చే దీవెనలు. మనం సమయానికి చేసే మాట సాయం, ఒక  ఆప్యాయమైన పలకరింపుఒక చిరునవ్వుతో ఇచ్చే ఒక పువ్వు కూడా, ఒకో సారి ఎన్నో జీవితాల్ని నిలపెట్టవచ్చు.

అందుకే మనకు అందిన దాంట్లో ఎంతో కొంత ధర్మబద్ధంగా దానం చేయాలి. అది అన్నార్తుల ఆకలి తీర్చాలి, అవసరాల్లో ఉన్నవారికి బాసట కావాలి. అప్పుడే అ భగవంతుడు హర్షిస్తాడు, నిన్ను తన వాడిగా చేసుకుంటాడు. ప్రేమతో అక్కున చేర్చుకుంటాడు.  పునీతుడ్ని చేస్తాడుఅప్పుడే నీ  జీవితం సార్థకం అవుతుంది.  

అయితే దానం చేయడం ఎంత ముఖ్యమో అపాత్ర దానం అంత దోషము. దానము తీసుకునే వాడు కూడా అర్హుడు, అవరరార్తుడై ఉండాలి. లేక పోతే అది కడలిపై కురిసిన వాన లాంటిదవుతుంది.  పట్ట పగలు వెలిగించిన దివిటీ అవుతుంది. అందుకే నిర్మలమైన మనసుతో చేసే సాయం  అమృతం కన్నా శక్తి వంతమైనది. దానం మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో తిరిగి ఆశించకుండా ఉండాలి. మనకు ఉన్నంతలో చివరి నిముషం చివరి ముద్దా వరకు దానం చేసే అవకాశాన్ని కోల్పోకూడదు.

బహుశా అందుకే ఏది తిన్నప్పుడైనా నోటితో సగం కొరికి తినకూడని, ముఖ్యంగా దేవుడి ప్రసాదం కొద్ది కొద్దిగా త్రుంచుకొని తినాలని, అప్పుడు అది చివరి వరకు ఎవరికైనా పెట్టె అవకాశం చివరివరకు ఉంటుందని  పెద్దలు చెబుతారనుకుంటా.  ఒక చెట్టుకి నువ్వు రోజు ఒక కుంచెడు నీళ్ళు పోస్తే అది నీ కుటుంబానికి ఎన్నో రోజులకు సరిపడా ఫలాలనిస్తుంది. నీవు వేసే ఒక్క గడ్డి పోచకు ఆ గోవు అమృత తుల్యమైన పాలనిస్తుంది. అలాగే నీవు చేసే చిన్న దానమే నీకు జీవితంలో వర దానమై ఫలమిస్తుంది.

మనకు ఆకలికి మించి అన్నం తింటే ఎలాగైతే అజీర్తి అవుతుందో సంపద కూడా అది అవసరాన్ని మించి ఉంటే మనకు, అనారోగ్యం, అపాయం కలిగిస్తుంది. ఇంట్లో సంపద పెరిగినప్పుడు, మరియు పడవలో నీరు నిండినప్పుడు నీ రెండు చేతులతో దానిని బయటకు తోడి వెయ్యమన్న భక్త కబీర్ మాటల్లో ఎంతో  జీవన వేదాంతం ఉంది. అవసరాన్ని మించిన సంపద మనిషిని ఎలా ముంచేయగలదు అన్న జీవన సత్యాన్ని ఇంతకన్నా సూటిగా చెప్పగలమా?


శుభస్య శీఘ్రం