Friday, July 9, 2010

అహం బ్రహ్మాస్మి -అష్టకాల విద్యాచరణ్


యజ్ఞయాగాదులు లోకకళ్యాణార్థము ఉద్దేశించి చేసేవైతే, మంత్ర జప పారాయణాలు మాత్రం మానవుని వ్యక్తి గత, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేవి. స్తోత్ర పారాయణము మానవుణ్ణి దైవ కృపకి ప్రాప్తున్ని చేయడమే కాక, తమ జీవితం పట్ల సరైన దృక్పథం కలిగే అవకాశం కల్పిస్తుంది. జ్ఞానాన్నిస్తుంది. మానవుణ్ణి సృష్టి లోని మిగతా ప్రాణులనుంచి వేరు చేసి ప్రత్యేకంగా నిలపెడుతుంది. విశ్వం లో ఈ ధరిత్రికి ప్రతినిధి గా గుర్తింపునిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. భూసురుల్ని చేస్తుంది. ఏకంగా బ్రహ్మనే చేస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్న మాటకి మూల సూత్రం అదే.

వేద విద్యా పారంగతులైన మన మహర్షులు తమ తపశ్శక్తినంత క్రోడీకరించి మంత్ర మూలాలైన బీజాక్షర సహితంగా విరచించి మనకందించిన విజ్ఞానాయుధాలు, అందునా జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతి దేవి స్త్రోత్రములన్ని ఒక్క చోట చేర్చి అందరికి అందించడము ద్వారా లోక కల్యాణం సాధించడం కూడా ఒక మహా యజ్ఞమే!! అలా ఇరవై ఏళ్ళ క్రితం ప్రారంభించ బడ్డ ఈ క్రతువు మరిన్ని హృదయాలకు స్వాంతననందిచాలన్న చిన్ని తపనే ఈ మలి ముద్రణ.

"సర్వే సుజనా సుఖినో భవంతు"