Saturday, April 14, 2012

దైవం మానుష రూపేణ....

దైవం మానుష రూపేణ....


మనం ఏదో అవసరంలో ఉంటాం. అనుకోకుండా ఎవరో సహాయం చేస్తారు. మనం ఆ మనిషి  దేవుడులా వచ్చి సాయం చేసాడని  మన కృతజ్ఞతలు తెలియచేస్తాం. మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకు అలా సహాయం చేసారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్పురిస్తాయి. అది మనం ఎప్పుడో ఎవరికో మనం చేసిన  సాయం వల్లో మనకీ సాయం దొరికిందని సరిపుచ్చుకుంటాం.  లేదంటే పూర్వ జన్మ సుకృతం అని సంతృప్తి చెందుతాం.  చాల మందికి రక రకాల నమ్మకాలుంటాయి. చేసే ప్రతి పనిలో కొందరి మాటను దైవంగా భావిస్తారు.  ఎందుకంటే కారణం చెప్పలేరు. అది కేవలం నమ్మకం అంతే. అలాటి నమ్మకమే దేవుడిపై మనిషుండే విశ్వాసం. ఆ నమ్మకమే మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఆ దైవభీతే మనిషిని నీతిగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆ నమ్మకమే సామన్యునితో  అద్భుతాలు చేయిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. కొందరు ఆ అదృష్టాన్ని అందుకుని అందలాలు ఎక్కితే మరి కొందరు ఆ విశ్వాసాన్ని భక్తిగా మార్చుకుని తమ జీవితాల్ని దైవసేవకు అంకితం చేసుకుని పునీతులవుతారు. మహర్షులవుతారు.


 ఏది ఏమైనా ఈ సృష్టిలో ప్రతి మానవుడి  ప్రథమ కర్తవ్యం తన  చుట్టూ ఉన్న మంచిని గుర్తించడం అది మనకు ఎంత శుభాన్ని కలిగిస్తున్నదో తెలుసుకోవడం. అది ఈ ప్రకృతి కావచ్చు, మనల్ని కాపాడే మన పెంపుడు జంతువులు కావచ్చు. అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి మన బాగు కోరుకునే  మన  జీవితభాగస్వామి కావచ్చు. నిరంతరం మన అభివృద్ధిని కాంక్షించే మన స్నేహితులు కావచ్చు, కేవలం మీరు దానం చేసే ఒక్క రూపాయి కి మీకు  వందేళ్ళ ఆయురారోగ్యాలు  కోరే మీ వీధి చివరి బిచ్చగాడు కావచ్చు. ప్రతి క్షణం మీ పని తన పనిగా చేసే మీ పనివాడు కావచ్చు. వీరంతా ఆ దేవుని స్వరూపాలే. నీవు నమ్మిన ఆ దేవుడు పంపిన దూతలే. ప్రతి ప్రాణి మరొక ప్రాణికి ఆ దైవం పంపిన సేవకులే. అవరసానికి అంది వచ్చే ఆ దేవుడి ప్రతినిధులే. సర్వం బ్రహ్మ మాయం అంటే ఇంకేదో కాదు ఇదేనేమో అని నా అభిప్రాయం. మనం చేసే మంచికి ఆనందపు ప్రసాదం, చెడుకు బాధల శటారిలు. జమాఖర్చు అన్ని సమానం. మనమంతా ఒకరికి ఒకరు దేవుడి స్వరూపాలే కాని, ఎవరికీ వారు మాత్రం కేవలం మానవ మాత్రులన్నవిషయాన్ని మనం మరిచిపోగూడదు. సాక్షాత్తు ఆ  దైవం మానవుడి అవతారం ఎత్తినపుడు మనిషిగా అన్ని విధులు నిర్వహించాడు, అన్ని కష్టాలు అనుభవించాడు. చివరకు చెడుపై విజయం సాధించాడు. దేవుడు ఈ లోక కల్యాణానికి ఎన్నో అవతారాలెత్తాడు. ఎందఱో మహానుభావుల రూపంలో ఈ మానవుల జీవితాల్ని ప్రభివితం చేసారు. అది శంకరచార్యుడైన, సాయిబాబా అయినా,  గౌతమ బుద్దుడైనా, వారంతా సామాన్యులుగా జన్మించి అసామాన్యులుగా జీవితాల్ని మలుచుకున్నవారు. వారి నందరిని  మనం దైవంగా ఆరాధించాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ అలంటి మహానుభావులెందరో.     


నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, లోకంలోని ఈ వికలాంగులు ఈ జీవ రాసులందరి తరఫున  వారు చేసిన పాపాలన్నిటికి తాము బాధ్యత  తీసుకుని, వారు ఈ అన్గావైకల్యమనే శిక్షను అందరి తరఫునా అనుభావిస్తునారేమో అని. అదే నిజమైతే, వారి విషయంలో మన బాధ్యత ఇంకా పెరగడం లేదా. వారిలో మనకు దైవం కనిపించడం లేదా? దేవుడికోసం చేసే ఎన్నో ఖర్చుల్లో కొంతైనా ఈ దైవస్వరూపాల కు చెందడంలో ధర్మం లేదా? మానవసేవ కూడా  మాధవ  సేవేనన్న గొప్ప విషయం మనకు తెలియనిది కాదు కదా. 


దైవం ప్రతిసారి, ఒకే రూపంలో ఉండకపోవచ్చు. కాని అది  అనునిత్యం అనేక విధాలుగా, మనల్ని కాపాడే అమోఘమైన ఒక శక్తి. అది దైవాన్ని పరిపూర్ణంగా, అనియమితంగా నమ్మినవారికి అడుగడుగునా సాక్షాత్కరిస్తాడు. ప్రతి మనిషిలో దర్శనమిస్తాడు. అందుకే మనం చేసే ప్రతి పనిలో మనం దైవాన్ని చూడాలి. మనం కలిసే ప్రతి వ్యక్తిలోని ఆ మహాశక్తికి  సాస్త్రాంగ నమస్కారం చేయగలగాలి. దైవం మనకు ఈరోజు, ఎరూపంలోనైనా  దర్శనం ఇవ్వవచ్చు. ఆ అపురూప ఘట్టాన్ని కోల్పోవద్దు. ఇదీ ఆ దేవుడిని కృపని పొందే మార్గమేనని గుర్తిద్దాం. జీవితాల్ని సాఫల్యం చేసుకుందాం. శుభస్య  శీఘ్రం.  

Monday, January 2, 2012

శరణా గతి - ఒక జీవన విధానం


శరణా గతి - ఒక జీవన విధానం  
నీ  జ్ఞానం పరిమితం. లోపభూయిష్టం. నీ సామర్థ్యం  అతి స్వల్పం.నీ జీవితం మరీ సూక్ష్మం. నీవు ఆలస్యాన్ని భరించలేవు. అందుకే నీకు పూర్తిగా అర్థం కాని విషయాలను కూడా నువ్వు సాధించాలని ప్రయత్నం చేస్తావు. ఘోర పరాజయాన్ని పొందుతావు. ఎంతో ఆలస్యంగా పరిస్థితిని అర్థం చేసుకుంటావు. ఫలితాన్ని తప్పించుకొనుటకు ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తావు. అవి ఎంత దూరమో, అనుభవించడం ఎంత కష్టమో తెలుసుకునే లోపే జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. నీ బాధ్యతల్ని నీవు నిర్వర్తించలేదు. సంఘ నియమాల్ని పాటించలేదు. ఎవరి అంచనాలను నీవు చేరలేదు.ఎవరి ఆశలు నీవు తీర్చలేదు. ఇప్పుడే ఈలోకంలోకి వచ్చ్నినట్టుంది.అప్పుడే జీవితపు చివరి మజిలి దగ్గరపడినట్టుంది. ఈ స్థితిలో నీవు ఎవరిని తలుచుకుంటావు?. ఎవరు నీ సమస్యకు సమాధానం చెపుతారు?. అప్పుడు కేవలం నీకున్న ఒకే ఒక్క ఉపాయం ఏది?.

అదే  అన్ని లోకాలను రక్షించే  ఒకే ఒక్క శక్తి. నీకు అండగా నిలుస్తుంది.   అదే నీకు సర్వస్వం అవుతుంది. ఆ శక్తికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఆ శక్తే భగవంతుడు. నీ బాధలన్ని తీర్చే బాధ్యత తీసుకున్న పరమ శక్తి. తన పంచాంగాలతో నిన్ను రక్షించే మహా శక్తి. ఇప్పుడు నువ్వు ఆ భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడివి. ఎంతో దయగల ఆ సౌందర్యవంతుడు  ఈ లోకం లోని అన్ని కష్టాలనుండి నిన్ను మానసికంగా దూరం చేసి నీకు ఆనందపు పారవశ్యాన్ని పొందేట్టు చేస్తాడు. నిన్ను ఈ ఐహిక బంధాలనుండి విముక్తున్ని చేస్తాడు. అంతం లేని అవరోధాల బాధల్ని పటాపంచలు చేస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ఆనందాన్ని నీదిగా చేస్తాడు. నీతో పసి పాపవుతాడు. సర్వం నీవు తనలో మమేకమవుతావు. సంపూర్ణ అనుభవాన్ని ఆనందాన్ని పొందుతావు. అదే శరణాగతి. నీవు దక్క  వేరే లోకం లేదనే తాదాత్మ్య స్థితి. అక్కడ కన్నీళ్లు లేవు. గాయాలు లేవు. కుట్రలు కుతంత్రాలకు స్థానం లేదు. సర్వం బ్రహ్మ మయం. ఇదే భగవద్గీత శ్లోక సారం. ఇదే  అత్యంత ఉన్నతమైన శ్లోకం. 
"సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"
మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  అదే మనమనే స్వర్గం. అదే లేనప్పుడు మనిషికి కలిగే బాధలే నరకం. నిన్ను అన్ని ఐహిక పాపాల  నుండి  విముక్తున్ని చేసి మోక్ష సాధనకు భగవద్గీత చూపిన ఉత్తమమైన మార్గం. నిన్ను నీవు భగవంతుడికి అంకితం చేసుకుని నీ కర్మ నీవు పాటించు. అంతా తానై నిన్ను తనలో ఐక్యం చేసుకుంటాడు. అదే కైవల్య మార్గం. ఖురాన్ బైబిల్ కూడా ఇదే విషయం తు చ తప్పకుండా చెపుతాయి. మతం ఏదైనా సారం ఒక్కటే. అదే ఏదో ఒక శక్తికి నిన్ను శరణాగతి చేస్తుంది. అదే ప్రతి జీవికి, జీవితానికి పరమార్థం.



Saturday, September 17, 2011

ఒకింత వేకువ నాలో....


                                       


అవును.... ఒక సామాన్యుడిగా ఈ ప్రపంచంలో జరిగే మార్పులకు నేను మానసికంగా  సిద్ధంగా లేను. టీవీ సీరియల్లో కష్టాలకు కన్నీళ్ళు పెట్టె నేను నిజ్జంగా జరిగిన భూకంపం బాంబు పేలుళ్ళ వార్తలు మాత్రం ఒక నాటకము  చూసినట్టు చూస్తున్నాను. ఒక వేళ అదే మనం ఉన్న చోట జరిగితే నేను ఎలా ఎదుర్కోవాలో నేను ఆలోచించానా?. అసలు అవి ఎలా, ఎందుకు జరుగుతున్నాయి, వాటిని మళ్లీ జరగకుండా ఆపాలంటే మనం ఏమి చెయ్యాలి?. నాలో స్పందన శూన్యం. ఇవన్ని  నేను పాట్య పుస్తకాల్లో చదువుకోలేదు. ఎవరైనా అడిగినా ఏదో వార్తాపత్రికల్లో చదివిన జ్ఞానముతో  ఏదో సమాధానం చెపుతాము. అదంతా నిజమేనా...తెలియదు. ఒక సంఘటనకు వార్తను రాయాల్సింది బదులు, తమ అభిప్రాయాన్ని రాసే ఈ పత్రికలిచ్చే జ్ఞానం మనకు మేలు చేస్తుందా?.   మనకు ఏది పట్టదు. స్కాం జరిగితే గాని నాకు 2జి గురించిన జ్ఞానం రాలేదు. మనిషిగా మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా? ఆపోల్లో II చంద్రుడిపై అడుగు పెట్టి అప్పుడే 
ముప్పై ఏళ్ళు దాటి పోయింది. మళ్లీ అటువంటి ప్రయత్నం  ఎందుకు జరుగలేదు? ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకునే నాయకులకి దాని గూర్చి ఆలోచించే సామర్థ్యం, విజ్ఞానం, చదువు కావాలి.

ఈ ప్రపంచం మొత్తం అవినీతి, దౌర్జన్యం, అన్యాయం, పేదరికం అనే నాలుగు పాదాల దౌర్భాగ్యం. పని చేసినందుకు ఇచ్చేది జీతం, పని అయ్యినందుకు ఇస్తే బహుమతి, అదే పని చేయడానికి ఇస్తే?    అన్న హజారే చెపితే కాని అది లంచమని తెలియదు. లంచగొండి తనం ఫై చట్టం రావాలంటే తనను నరకడానికి గొడ్డలినిచ్చె చెట్టంత అమాయకత్వం మన నాయకులకు  లేదు కదా.  మరి నేను ఎప్పుడు మేల్కొంటాను? నాలో వెలుగు ఎప్పుడు వస్తుంది? అవును ఒకింత వేకువ నాలో కావాలి.

దేవుడ్ని భయంతో, పాప భీతితో కాక భక్తితో కొలిచే రోజు రావాలి. కోరికలు తీరడానికి  కాక వాటిని తగ్గించడానికి నా ప్రార్థన జరగాలి. నేను చేసే దాన ధర్మం, పుణ్యం కోసం కాక, ఎదుటివాడి అవసరాన్ని బట్టి, మరియు ఆత్మ తృప్తి కోసం చేయాలి. నాలో సమూల మార్పు రావాలి. అంటే ఆధ్యాత్మికత భావం పెరగాలి.  అవసరాలు తగ్గించు కోవాలి. 
సామాన్యంగా జీవిస్తూ గొప్పగా ఆలోచించే వైఖరి నాలో పెరగాలి. అరిషడ్వర్గము తెగనరికే ఖడ్గం కావాలి. ఇలాంటి వేకువ కోసం నా ఎదురుచూపు. అసతోమా సద్గమయా... 




     

Monday, July 4, 2011

ఆత్మసాక్షిగా......

నా ప్రయాణం అనంతం. దిగంతాల అంచులలో, అగాధాల లోయల్లో, ఎడారుల్లో, మైదానాల్లో, మనుషుల మధ్య, మనుసుల లోపల, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, బాధలు, ఆనందాలు, చావు పుట్టుకలకు మౌన సాక్షిగా, అప్పుడప్పుడు భావాలకు అతీతంగా, ఎన్నో ప్రాణులను ఒడిలో పెంచుకుంటూ, పంచుకుంటూ సాగే ఈ ప్రయాణం అలుపు లేనిది.


ఎంతో చూసాను. ఉద్యమాల్నే ఉపిరిగా చేసుకున్న గాంధీలను, స్పూర్తిగా నిలుపుకున్న పేద విద్యార్థులను, అవే ఉద్యమాలను బ్రతుకు తెరువుగా మార్చుకుని తమ అభివృద్ధికి బాటలు వేసుకున్న నాయకులనూ చూసాను. కుట్రలూ కుతంత్రాలను నా గాలి సాక్ష్యాలు నిరూపించ లేవు. నీటి బుడగల మాటలు నిలువలేవు. రూపం లేని ఆకాశం విలువలేని రూపాయి వీటి ముందు. వేదనలన్నీ కనిపించి కనిపించని పంచభూతాల్లా మిగిలిపోతున్నాయి.


నా హృదయం నిండా పెరిగే చెట్లు, కదలని రాళ్ళు, పారే నీళ్ళు, మట్టివాసనలే నా అలంకారం, నా ఆనందం ఒక వసంతం, బాధ ఒక శిశిరం, కోపం గ్రీష్మం, పంటపొలాల పండుగలే నాకు సీమంతాలు , ఆనందంగా వర్షిస్తే చిరునవ్వుల బహుమతులు. కృతజ్ఞతల కన్నీళ్లు. ఆనంద భాష్పాలవి. అందుకే నాకు ఒకటిస్తే బదులుగా వేలిస్తాను. కాని ఏమి జరుగుతోంది?.. ఆనందపు ఆనకట్టల అభివృద్దికి వరదలతో ఆనవాలు. భూమి కడుపు చీల్చి కట్టిన ఆకాశ హర్మ్యాలకు భూకంపాల జ్ఞాపకాలు. ఉపిరితిత్హుల నిండా కాలుష్యపు ఆయాసాలు, కాలేయమంతా నాగరికత tho కాలిన మరకలు, విలయతాన్డవమని మీరంటే విలాప తాడనమని నేనంటాను. నేనేమి తప్పు చేసాను. అందరికి స్వచ్చమైన ప్రాణ వాయువునివ్వడమా!!, అలసిపోతే చల్లని గాలిని, నీటిని ఇవ్వడమే పాపమా?. ఎప్పటికి అరగని ప్లాస్తిక్కుల భోజనమేనా నాకు? కరగని ఇనుపముక్కల వైద్యమా.. నన్ను కాపాడండి ..నన్ను కాపాడండి.. నేను ప్రకృతిని...మీ ఆక్రుతినే నా అస్తిత్వంగా బతుకుతున్న దాన్ని..నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించ గలరా ఎవరైనా.. కనీసం ప్రతి ఒక్క చెట్టు నాటండి. అదే నాకు మీరు చేసే ఆయుర్వేద వైద్యం...

Saturday, July 2, 2011

అందరి బంధువు



అందరి  బంధువు
 ఒకసారి కంచి స్వామి ఉత్తర దేశ యాత్రలో ఉన్నప్పుడు ఓ భక్తుడు గా ట్ట!!!. "స్వామీ ! దశావతారాలన్నీ పరిశీలిస్తే అన్ని అవతారాలు కేవలం ఉత్తరభారతం లోనే ఉన్నాయి అలాగే దక్షిణ భారతమంతా కేవలం ఎక్కువగా స్వాములు సన్యాసులు అవతరించారు ి, అంటే దేవుడికి దక్షిణ భారతం అంటే ఇష్టం లేదంటారా?" అని వింత ప్రశ్న అడిగాడట . దానికి స్వామి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట. " అయ్యా మీ పరిశీలన ఉత్తమమైనదే !. అవతారాలన్నీ దుష్ట సంహారానికి ఉద్దేశ్యించినవి అంటే దేవుడే స్వయంగా వచ్చి దండిస్తే కాని బహుశా మనుషులు మారరేమో!! అదే దక్షిణభారతం లో భక్తులు  కేవలం స్వాములు చెప్పే మంచి మాటలు,  ప్రవచానలవల్ల వారి జీవితాలు ప్రభావితం చేసుకుంటారు. అందుకే దేవుడికి అవతారాల అవసరం రాలేదనుకుంటా"...అని ముగించారు.

గురుశిష్య పరంపర మన జాతికి మూలాధారం. అడుగడుగునా మనకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని, గురువు యొక్క ప్రభావం మనమీద వారి ఆశీర్వచన రూపం లో ఉంటూ  మనకి దివిటీలా మార్గనిర్దేశం చేస్తుంది. గురువు మనసెప్పుడు మంచి శిష్యుల చూట్టునే తిరుగుతుందనిపిస్తుంది. నిజానికి ఉత్తమమైన శిష్యుల ఆత్మ బంధం నుంచి స్థితప్రజ్ఞులు, బ్రహ్మజ్ఞానులైన గురువులు కూడా తప్పించుకోలేరేమో. మనకి వీరబ్రహ్మం, సిద్దప్ప కధ విన్నా, షిర్డీ బాబా కథ విన్నా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

గురువు అందరి శిష్యులకు ఆత్మ బంధువు. వారి ఆశీర్వాదం అందరికి సమానం. కానీ శిష్యుల పొందే ఫలంలో తేడా కేవలం వారి నమ్మకం, పట్టుదల,  సాధన లో వ్యత్యాసం వల్లే. ఒక గురువు తమ ప్రబోదాల్ని అందరికి సమానంగా పంచుతాడు. గురువు ప్రేమ ప్రపంచమంత విశాలం అది అందరికి మనసులో స్థానాన్ని కల్పిస్తుంది. కోపం  అగ్ని లాంటిది. అది మనం తప్పు చేస్తే దండించి మనల్ని  పునీతులుగా చేసే బడబాగ్ని. మన బాధలన్ని తనవిగా చేసుకుని, ఉపశమనం కలిగించే ధన్వంతరి. ధనిక పేద అనే తారతమ్యం లేకుండా, ఏమాత్రం స్వార్థం లేకుండా, ఏ ఫలాపేక్ష లేకుండా   అందర్నీ అక్కున చేర్చుకుని లాలించే  వ్యక్తిత్వం కేవలం ఒక్క గురువుకే సాధ్యం.

 గురు సేవ పరమపద సోపానానికి మొదటి ఆటలోనే పెద్ద నిచ్చెన వంటిది. నిత్యం గురు స్మరణ, వారు ఆశయాల ఆచరణ చేసే ప్రతి శిష్యుడు ఎక్కడ ఉన్న గురువు మనసు అతడిని వెంటాడుతూనే ఉంటుంది.  అతన్ని నిత్యం కాపాడుతూనే ఉంటుంది. మానవుడికి సంస్కారమనే ఆయుధాన్ని, జ్ఞానమనే సంపదని అందించి, మన విజయమే తన పరమానందంగా భావించి, మనల్ని అసామాన్యులుగా మలచి తను సామన్యుడుగా మిగిలిపోయే  అజ్ఞాత శక్తిగురువు.  కనిపించే దైవం గురువు. మన మేలే తప్ప తన గురించి తాను పట్టించుకోని గురువుకి , మన వంతు సేవగా మనమేం చేస్తున్నాం?. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ విహార  యాత్ర  మాత్రం జరుపుకుంటాం. కాని ఒక్కరమైనా ఈ ౩౬౫ రోజుల్లో కనీసం ఒక వారం రోజులు గురు సేవలో తరిద్దామన్న ఆలోచన చేసిన వారున్నారా అని మనల్ని మనం గుండె మీద చేయి వేసుకుని అడగాల్సిన ప్రశ్న. పూర్వజన్మ సుకృతం వల్లే అది సాధ్యము. అందుకే కనీసం "గురుపూర్ణిమ" రోజైనా గురువు పాదాలకు నమస్కరించి వారి చల్లని నీడలో గడపాలని ఈ పరంపర మన సంస్కృతిలో ఒక భాగంగా మన పెద్దలు అనుసరించారు . దానికి సమయం లేని వారిని ఆ దేవుడు కూడా రక్షించలేడెమో . అమంగళం ప్రతిహతమవుగాక....   

ధ్యాన:  మూలం  గురుర్  మూర్తి:  పూజ:  మూలం  గురు  పదం
మంత్ర  మూలం  గురుర్  వాక్యం  మోక్ష:  మూలం  గురు  కృప:
                                                                                                                                                                                                                                                                        గురుపూర్ణిమ సందర్భంగా ....