Friday, October 2, 2026

అష్టకాల విద్యాచరణ్ 5వ అష్టావధాన పూరణలు

 20.09.2026


గజానంద స్నేహ బృందం రాఘవేంద్ర నగర్ సిద్దిపేట అవధాని శ్రీ బ్రహ్మశ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు 


ప్రార్థన:

మీ గణములు మీకున్నవి

మా గణములు మాకు నిచ్చి మము పాలించన్

వేగమ్ముగ రా గణపతి

సాగించుదు పద్య కేళి సారస్యముగా


అమ్మా పదముల నిమ్మా

చెమ్మారని పద్య ధార స్థిరముగ నిమ్మా

సొమ్మా కోరను నేనెటు

చిమ్మని చీకట్లు దొలగు చికిలము నిమ్మా!


అభయమ్మిమ్మని ధార ధారణలకై యార్తిన్ స్తుతిన్ సల్పుచున్

విభవమ్మిచ్చు సమాస భావములకై వేడ్కొందు శ్రీ శారదన్

సభలో గూడిన పండితోత్తములనే సౌహార్దమున్ జూపుచున్ 

రభసన్ జేయక పద్యదోషములనే లాలించ నే వేడెదన్





నిషిదాక్షరి:శ్రీ గుండ్ల రాజు అంశం: వినాయక నవరాత్రుల సందర్భంగా గణేశ స్తుతి

కం.

శ్రీలన్ బంచన్ వేడ్కన్

పాలించన్ వచ్చినావొ భక్తిన్ గొల్తున్ 

శూలి సుతుడలంబోదర 

మాలిన్యముద్రుంచుమయ్య మంచిని నేర్పన్!


2.సమస్యాపూరణం: శ్రీ.ఎం.డి ఉస్మాన్ గారు

చం.

కౌముది వెల్గులీనగను గాంచితినింపుగ కాళరాత్రిలో!

రాముడు సీత జాడగొన లక్ష్మణు తోడుత కాననంబులన్

భీమ ప్రయత్నముల్ సలిపి వేదన తోడుత నన్ను జేరిరో! 

కాముని మించు రూపమది కౌతుక మబ్బెను మామనస్సునన్!


3.దత్తపది:శ్రీమతి దుడుగునాగలత 

భవనము,కవనము, లవణము,దవళము.

గణేశుని నవరాత్రులు.

గీ.

భువనమంత నాధ్యాత్మపు భవనమువలె

సవనములు సల్పి సాహితి కవనములను

రక్తి కల్పించెడు ప్రసాద లవణములను

ధర్మముగ బంచె గణపతి దవళకాంతి!


4.వర్ణన: ఉండ్రాళ్ళ రాజేశం గణాలకు అధిపతి వర్షాలు కురిపించాలని వేడుకోవడం.


మత్తకోకిల 

కర్షకాళి సుఖమ్ము గోరుచు కష్ట బెట్టక వేగమున్

వర్షముల్ గురిపించ వృష్టిగ పండుగల్  జరిపింతుమో

హర్ష మిచ్చెడు పాడిపంటలె యన్నదాతల గాచగా

స్పర్శ మాత్రము చేత బ్రోచెడు పార్వతీసుతుగొల్చెదన్..


5.చిత్రం:కాల్వ రాజయ్య ఎలినో వలన రైతుబడే కష్టాలు

కం.

హలమో హాలాహలమో

విలయమ్మెయె రైతు బ్రతుకు వృష్టియెలేకన్

కలయయ్యెను సేద్యమ్మిక 

పొలములు మరు భూములయ్యె

పుణ్యమెవరిదో!


6.ఆశువు:బి.పరంధాములు

గణపతి బైకులు నడిపే వ్యక్తుల చూసి ఏమనుకుంటున్నాడు.

1.కం.

అందముగా నిదియున్నది 

ఇందురమానీదువేగ మెక్కడగనుమా

పందెమ్ముకు సిద్ధమ్మా 

విందులు నిక చాలు చాలు వేగమెరమ్మా!!

2.గీ.

కష్టమనకను పండుగల్ ఇష్టమనుచు 

కూడి జరిపింప జగతిలో వేడుకగను 

భారమెంచక సాహితీ ప్రక్రియలను

వర గజానందబృందమే 

 జరిపెనిచట.


7.అంత్యాక్షరి కుమారి లక్ష్మీ ప్రసన్న.

కం.

'డా' యను అక్షర మిడుచును 

నాయాసము పెంచినావు నవధానికికన్

నీయనుమతి తోడనిపుడు 

సాయమ్ముగ రావెతల్లి సద్గుణ లక్ష్మీ!!


8.అప్రస్తుతం:శ్రీ నల్ల అశోక్ గారు.



స్పందనలు



[21/9 17:59] Varukolu Lakshmaiah: తే. గీ.

1.అష్టకాలనృసింహుడి యాజ్ఞ చేత 

సాగిపోవాలి యవధాన చతురుడిగను

వీణపాణియే మీ యింట వేల్పు యయ్యి కొలువుదీరెను మదిలోన కోర్కెదీర్చు


2.ఉ.

సారస నేత్ర సత్పదము- శారద పీఠమునందు నిల్పి, సం

సారము నందు వెల్గి రుచి సారము గ్రోలుచు జ్ఞాన దీప్తితో

ధీరతమీర కావ్యరస దివ్య సుధామధురంబు జిందుచున్,

పారగజేసె వాగ్నిధిని పండిత పామరు లెల్ల మెచ్చగన్!


3.కం

విజయంబందెను సభలో 

సుజనుల దీవెనలతోడ శోభిల్లెనిటన్

ప్రజలందరు మురిసిరహో! 

యజుడే నీ యందు నిలిచి యాజ్ఞను జేసెన్!


4.తే.గీ.

అమ్మ దివ్యానుగ్రహంబిది యండగాగ

వాణి నృత్య భంగిమలెన్నొ వదన మందు

తనర,విద్యాచరణు నవధానమిటను 

విజయదుందుభిమ్రోగాలి వినులలర!


5.ఆ. వె.

ఆత్మ యందు నిలిపి యవధాన విద్యను 

చేయుచున్న కొలది సృజన పెరుగు

వాణి కరుణ యున్న వాసి కల్గినయట్టి

పద్య ధార లెల్ల పరవశించు


వరుకోలు లక్ష్మయ్య 

తెలుగు భాషోపాధ్యాయులు.

కవి, రచయిత.

9704865816.

[21/9 18:03] Varukolu Lakshmaiah: తేది:20-09-2026.ఆదివారం:పంచమ అష్టవధానం-సిద్ధిపేట.

అవధాని శ్రీ అష్టకాల విద్యాచరణుగారిపై అభినందన,స్పందన పద్యాలు:

తే.గీ.

1.అష్టకాలనృసింహుడి యాజ్ఞ చేత 

సాగిపోవాలి యవధాన చతురుడిగను

వీణపాణియే మీ యింట వేల్పు యయ్యి కొలువుదీరెను మదిలోన కోర్కెదీర్చు


2.ఉ.

సారస నేత్ర సత్పదము- శారద పీఠమునందు నిల్పి, సం

సారము నందు వెల్గి రుచి సారము గ్రోలుచు జ్ఞాన దీప్తితో

ధీరతమీర కావ్యరస దివ్య సుధామధురంబు జిందుచున్,

పారగజేసె వాగ్నిధిని పండిత పామరు లెల్ల మెచ్చగన్!


3.కం

విజయంబందెను సభలో 

సుజనుల దీవెనలతోడ శోభిల్లెనిటన్

ప్రజలందరు మురిసిరహో! 

యజుడే నీ యందు నిలిచి యాజ్ఞను జేసెన్!


4.తే.గీ.

అమ్మ దివ్యానుగ్రహంబిది యండగాగ

వాణి నృత్య భంగిమలెన్నొ వదన మందు

తనర,విద్యాచరణు నవధానమిటను 

విజయదుందుభిమ్రోగాలి వినులలర!


5.ఆ. వె.

ఆత్మ యందు నిలిపి యవధాన విద్యను 

చేయుచున్న కొలది సృజన పెరుగు

వాణి కరుణ యున్న వాసి కల్గినయట్టి

పద్య ధార లెల్ల పరవశించు


వరుకోలు లక్ష్మయ్య 

తెలుగు భాషోపాధ్యాయులు.

కవి, రచయిత.

9704865816.

[21/9 19:58] Varukolu Lakshmaiah: అవధాని శ్రీ అష్టకాలవిద్యాచరణ్ అవధానంపై స్పందనపద్యాలు


1చం.

సలలితమాధురీసుధలసాంద్రపుప   ల్కులగూడివేడ్కయై

యలరగపాండితీగరిమయబ్బురమేయనపండితోత్తముల్

దలచుచుమానసంబుననుధారణజేసెనునింపుగూర్చగన్

విలసితమైవధానమున విద్దెలదేవికిహారమవ్వగాన


2.కం.

విద్యా చరణ వధానము 

ఆద్యంతం రంజిలగనుయాహాయనుచున్

సద్యస్ఫూర్తిగలుగుచున్

విద్యా దేవియనుమతినివేడ్కగనీయన్!


MD. ఉస్మాన్ 

తెలుగు భాషోపాధ్యాయులు.

[21/9 20:01] Varukolu Lakshmaiah: అవధానిశ్రీ అష్టకాల విద్యాచరణ్ గారి అవధాన అభినందనలు.

ఆ.వె

అష్టకాలవారు నిష్టతోడనునేడు

ఆదిదేవ మెచ్చి హర్షమొంద

ఔర యనగ జేయ(న) అష్టావధానము

పులకరించెను సభ పుణ్య మూర్తి!


కాల్వ రాజయ్య

తెలుగు భాషోపాధ్యాయులు

కవి, రచయిత.

[21/9 20:07] Varukolu Lakshmaiah: అవధాని శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారి అవధానంపై స్పందన పద్యాలు.

1.ఆ.వె.

అవనియందు వెలుగు అవధాన విద్యయే 

తెలుగు తోటలోన తేనెలొలుకు 

అక్షరాల మైత్రి యమృత తుల్యముగను 

పద్య ధారణందు పరిమళంబు.


2.మ.కో.

అందమైనది పద్యమెప్పుడు నక్షరాలుగ సాక్షియై

సుందరంబవధాన విద్యయే స్ఫూర్తినిచ్చును భారతీ

విందుగాను గజాన స్నేహము వీర పుత్రులు నిల్వగా

సందులందున శ్రీచరణ్ డుది సాటిలేదుగ ధారణల్!


ఉండ్రాళ్ళ రాజేశం

తెలుగు భాషోపాధ్యాయులు.

కవి,రచయిత,బాలసాహితీ వేత్త.

[21/9 20:09] Varukolu Lakshmaiah: కంద పద్యము 

అభినందనలతో 🙏


కం.

విద్యా చరణవధానము

పద్యోద్యానమును బెంచ పరుగులు దీయున్

సద్యస్ఫూర్తిని కోరుచు

విద్యా చరణములు కొలువ వివేకము నొసగున్!


గుండ్లరాజు

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 

🙏

[21/9 20:11] Varukolu Lakshmaiah: అష్టకాల విద్యాచరణ్ అవధానంలో ప్రారంభంలో పద్యం 


 ఉత్పలమాల 

శారద పైన ధ్యానమును శ్రద్ధగ నిల్పితివో కదా సదా!

ప్రేరణ నిచ్చి మిమ్ములను పేర్మిగ నిల్పెను వాణి ధాత్రినిన్

దారిని జూపి వాక్కులను ధారణ శక్తిని ధారపోసెగా

తేరుగ సాగుచుండుమిక ధీరుడవై

యవధానమందునన్!


నల్లా అశోక్ 

తెలుగు భాషోపాధ్యాయులు.

[21/9 20:42] Varukolu Lakshmaiah: అవధాని గారిపై స్పందన పద్యాలు.

1.కం.

ఇల నిల్చిన గణపతియే 

తిలకించెను మీ వధాన దీక్షను నేడున్ 

కలకాలమివ్విధంబుగ 

నిలువుమనుచు దీవెనలిడు నిశ్చయమిదియే!


2.ఆ వె

విఘ్నములను బాపు విఘ్నేశ్వరానీవు 

సిద్ధిబుద్ధులొసగు శ్రీకరముగ 

మూషికంబునెక్కి మోదంబుగావచ్చి 

మమ్ముగావుమయ్య  మహిని నిలచి.


దుడుగు నాగలత

తెలుగు భాషోపాధ్యాయురాలు

కవయిత్రి.

అష్టకాల విద్యాచరణ్ 2వ అష్టావధాన పూరణలు

 మర్పడగ శ్రీవిజయదుర్గామాత,

సంతానమల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం న మధ్యాహ్నము 12గంటలకు *అష్టావధానము*:-  అవధాని: శ్రీ అష్టకాలవిద్యాచరణ్ గారు*

సభాధ్యక్షులు:

*ఆచార్య డా శ్రీ  చెప్పెల హరినాథ శర్మ* గారు దేవాలయ నిర్మాతలు.

సంచాలకులు:

అవధానతిలకబ్రహ్మశ్రీముత్యంపేటగౌరీశంకరశర్మ గారు

ముదిగొండ అమరనాథశర్మ

పృచ్ఛకవర్గము

సింగీతం నర్సింహారావు గారు.(సమన్వయము)

1)శ్రీ వర్కోలు లక్ష్మయ్య గారు (నిషిద్ధాక్షరీ)

2)శ్రీమతిజలజారాణి గారు(సమస్య)

3)శ్రీమతి మాధవీలతగారు.(దత్తపది)

4)శ్రీ పన్యాల అంజిరెడ్డి గారు.(వర్ణన)

5)కొరిడె పవన్ కుమార్ గారు (ఛందో భాషణము)

6)శ్రీమతి బాలసరస్వతి గారు (పద్య అంత్యాక్షరి)

7) చిగురాల పద్మ గారు (ఆశువు)

8) గారు.(అప్రస్తుతము)

సాహితీ, అష్టావధాన అభిమానకవి,పండిత అవధానవర్యులందరినీ స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాం.

1.

నిషిద్ధాక్షరి:వరుకోలు లక్ష్మయ్య 

దుర్గామాత వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ నిషిద్ధాక్షరి:

కం.

(ప)    (త)(న)(వ)(న)(అ)(న)

మౌని నుతాంబవుగ 

మహిన్

(గా)  (వ)(న)(వ)(న)(న)(ర)(జ)(ద)(గ)

రాణించితిగావమమ్ము రావేవేడ్కన్!

గానమ్ములతో గొల్చెద 

కాననముల బడకవేగ కరుణన్ దుర్గా!!


2.సమస్యాపూరణం

జలజారాణి

ఉ.

" నాకిక చింత లేదు శరణాగతి నీవెగదమ్మశారదా"


రాకయునీది పద్యమును రంజిలజేసెడు బాధ నీది, నే 

పోకడ జూపినన్ విధిగ బుద్ధిని నేర్పెడు నేర్పునీది నా

వేకువ నీవుగాదె పరివేష్టితమైననుగాచుచుండగా


3.దత్తపది 

మాధవీలత -స్నేహబంధం

 సమత,మమత,చెలిమి కలిమి.


సమత యెట్టులకుదిరెనో సమ్మతమ్ము

మమత పెంపొంది చెలిమినన్ మాన్యులవగ 

లక్ష్యమందున శ్రీ కిషన్ రావు గారి

కలిమిగోల్పోయె నరసింహ కవివరుండు.


4.అంజిరెడ్డి 

గురువు బోధన విధానాన్ని గూర్చి వర్ణన:

గీ.

గురువు నేర్పించ పాఠముల్ గుర్తెరింగి 

పరుగులెత్తించు బాధ్యతల్ బాలలచట

పరువు నిలబెట్టు శిష్యులన్ వదలకున్న

కీర్తి చిరమౌచు నిలచును కేతనముగ


5.కొరిడెపవన్ కుమార్ 

ఛందోభాషణం.


ఆమ్ల క్షారమ్ముల నెరుగు నార్యులకును

 పద్య మెట్టుల యబ్బేనో పలుకు మయ్య

వారసత్వమున లభించె పద్యవిద్య

వాణిననుజేరి గెలిపించె రాణకెక్క...


6.

ఆశువు బోనాల విశేషము

 చిగురాల పద్మావతి 

1.కం.

 బోనమ్ముల పండుగలో 

గానమ్ముల భక్తి రసము గణనీయముగా 

నానందముసర్వమ్మయి 

పానమ్ములు పారుచుండు పరవశమందున్

2.ఆశువు రామాంజనేయులు చెలిమి.

కం.

రాముని ప్రేరణ తానై 

భీమసహోదరుడు నిల్చి భీష్మ ప్రతిజ్ఞన్

క్షేమమ్మును తెలుపుటకై 

నేమమ్మును తప్పకుండ నిలిచెను సఖుడై 


7.బాల సరస్వతి అంత్యాక్షరి."ర"

 కం.

రామా రఘుకుల సోమా 

మేమా మీ సేవకులము మీదయ తోడన్

రామా మీకడమేమటు 

రామాయణు మాటచాలు రక్తిని బెంచున్!


అంత్యఅక్షరం. "ల"


లక్ష్యము లేని దీ బ్రతుకు రంగములెన్నని నాటకమ్మునన్

భక్ష్యమభక్ష్యమన్న మతి బద్ధ విచక్షణ గాంచలేని యీ

కక్ష్యల హోరులోనబడి కర్మల భ్రాంతిని వీడలేక యీ

కక్ష్యకమందునిల్చి నిను గాంచుటసాధ్యమదేల భారతీ!




[8/8 17:34] Singeetam: మనవిద్యాచరణన్నకు

మనమంతయు వెళ్ళి సభన మద్దతు నీయన్

జనమెల్లరు మోదముతో

కనువిందుగజేసుకొనగ కలకలలాడున్

[8/8 17:51] తాటికొండ శివ కుమార్: విద్యా చరణుడు తప్పక 

సధ్య స్పురణతొ కవనము సలుపును నిజమున్

విద్యా దేవేసాక్షీ

పద్యాలల్లుము వరసగ ప్రక్కన నుందున్ !

🫣🫣

[8/8 17:53] Dr Gayathri Devi: ద్వితీయావధానమద్వితీయమగుత


కం.విద్యాచరణుని వాక్కులు

పద్యాలైసారస్వత వాద్యాలై ,నై

వేద్యాలై బుధవరులకు

సద్యఃస్ఫూర్తినొ సగు నిది సత్యము సుండీ!


వే.గా.

[8/8 17:57] మాముషా: చరణములందునహృదినా

చరణములేనమ్మికొల్చు*సౌశీల్యుడు;స

చ్చరణావధాని,విద్యా

చరణుడు, వాణీ కటాక్ష*వాగ్విభవుండే! 


విద్యా వాణీ వాగ్ఝరి

సద్యస్కాలమ్మునందు*సమకూర్చునుగా! 

ఆద్యంతమ్మద్వితీయము

పద్యోద్యానమ్మువాణి*పరిపూర్ణమ్మౌ!

[8/8 18:18] Mutyampeta: కవివై పద్యము జెప్పుచు 

రవివై మిత్రాళి హృదయ రాజీవములన్ ! 

పవివై ముందుకు సాగుచు. 

ఛవి జూపుమ అష్టకాల చరణా ! జయహో ! 👌👍🙏🌹

[8/8 18:33] Satyanarayana Rao Veludanda: శుభములు కలుగగ మిత్రుల

యభినందన లెల్లను వరుసై నిలువంగా 

విభవము మీరగ నవధా 

న భయము తొలగంగ మల్లన దయ గురియుతన్


✍🏻డా.వెలుదండ సత్యనారాయణ

                  పరమార్థకవి

                      8.8.26


శ్రీ విద్యాచరణ్ గారి 9 8 26 నాటి

 అవధాన సందర్భంగా..

మల్లన = మల్లికార్జునుడు

[8/8 18:35] B.C.S Sharma: 🕉️🌳

శుభాకాంక్షలు:-

తేటగీతి:-

÷÷÷÷÷÷

"అష్టకాల విద్యాచరణావధాని"

ఆది వారముదయమందునమ్మ చెంత

చేయబోవు "వధానము" శ్రీకరముగ

సాగుతమ్మ "విజయదుర్గ శక్తినిడగ.

---✍️డా||భోగయగారి.

చన్ద్రశేఖర శర్మ-9440044142,

గెజిటెడ్ హెడ్మాస్టర్,. బండిమెట్, పాటిగడ్డ,

సికింద్రాబాద్-3.

తేది::8ఆగస్టు,2026.

%%%%%%%%%%%%%%

[8/8 18:52] Lingeswara Sharma: ద్వితీయమద్వితీయమైనవేళలోనతెన్గుసా

హితీప్రయాణమింకసాగుహృద్యపద్యకేళిభా

రతీకృపాకటాక్షపాత్రులైసదావధానిగా

నితాంత ఖ్యాతినొందుతారునిశ్చయమ్ముగావుతన్


జి.లింగేశ్వర శర్మ

[8/8 18:57] Dr.Cheedela Sita Laxmi: అష్టావధాని శ్రీ విద్యా చరణ వాణీ దయాసముద్ర విజయోస్తు👌🎉🤝🙏🌹

---------------------

విద్యలందు మేటి విద్యాచరణుడును

పద్యములను చెప్ప ప్రబలు డితడు 

అమ్మనెపుడు కూడ నమ్మి యుండును వాడు

హాస్యమొప్ప జెప్పు  ననవరతము!!

---------------------

డా. చీదెళ్ళ సీతాలక్ష్మి 

అమెరికా



[9/8 16:08] Harimama: అష్టకాల విద్య ఆనువంశికమయ్యె 

పద్యగంగ పొరలి పరవశింప 

విశ్వ విభునృ సింహ విద్యాచ రణుడవ

ధాని సింహ మనువిధమురహించె

[10/8 10:59] Harimama: తండ్రి జూపిన బాటలో తనరు కాంతి ఆశయమ్మద్ది ఆత్మసంయమసుశాంతి 

ఛాందసమ్మైన పద్యసంబంధ  క్రాంతి

అష్టకాలాన్వయాబ్ధిలో అది హసంతి

[10/8 14:12] Harimama: "అష్టకాలాన్వయాబ్ధిలో అది హసంతి" అనే పాదం కాల ప్రవాహంలో ఆ దైవిక శక్తి చిరునవ్వుతో ప్రకాశిస్తుందని అర్థం. ఈ వాక్యం అనంతమైన కాలం మరియు శాశ్వతత్వాన్ని సూచిస్తుంది.

అష్టకాల విద్యాచరణ్ 1వ అష్టావధాన పూరణలు

 *బ్ర శ్రీ విద్యాచరణ్ అష్టకాల* వారి అవధానము.తేది17-6-2026బుధవారం. అయ్యప్ప స్వామిదేవాలయము మెదక్.

అంశం:- *నిషిద్ధాక్షరీ* అడిగినవారు శ్రీమతి సరస్వతీరామశర్మ గారు

అవధానిపూరణ పూరణ:-.👇

శ్రీదంబై శ్రేష్టమ్మై

వేదమ్మున్ బొంక జూచు ప్రేతన్ శాబ్దిన్

వేదన నిచ్చెడి దనుజుల

సాధించుచు గాచు మమ్ము శబరి గిరీశున్


*సమస్య*:-అడిగినవారు:-శ్రీ

జనమంచి ఫణీంద్ర ప్రసాద్

అవధాని పూరణ *సమస్య*

*పదుగురు మెచ్చు పద్యములు వ్యర్థము లౌనవ ధాన మందునన్*

పూరణ...

సదమలమైన చిత్తమున సాహితి సేద్యము సల్పకున్నచో 

మెదలని భావ లేశములు మిక్కిలి స్తబ్ధత దెచ్చిపెట్టుగా

చదువది యెంత నుండినను సఖ్యత జాలనిపృచ్ఛకాళితో

పదుగురు మెచ్చు పద్యములు వ్యర్థములౌ నవ ధాన మందునన్


*దత్తపది*-అడిగినవారు శ్రీదమ్మన్న ప్రసాద్ శర్మ గారు మెదక్ 

దాన వీర శూర కర్ణ  పదాలతో రామాయణమునకు చెందిన పద్యం.స్వేచ్ఛాఛందము

అవధాని పూరణ:-👇

కర్ణ పేయ మౌ శ్రీరామ కథను వినిన 

 వీర హనుమాను డచ్చట చేరిపో వు 

 దానవేంద్రుల దునుమాడు ధైర్య మిడుచు 

 శూర తత్వంబు తెలిపెడి వీరగాధ



*వర్ణన*-అడిగినవారు శ్రీరావికోటి సోమశేఖర శర్మ గారు

రజతోత్సవాల లో అశేష భక్తుల మనోభావములకు చంపకమాలలో పద్యం


అవధాని పూరణ:-👇

ప్రవిమల భక్తి చాటుటకు భక్తులు చేరిరి యొక్కచోటనున్

కవనపు ధార సాగెనిట కష్టము లన్నియు కృంగిపోనటుల్

సవనము సల్ప యాజ్ఞికులు సాదృశమౌనటు దైవలీలలున్

శ్రవణము జేసిరందరును శ్రద్ధగ నా మణికంఠు గొల్చుచున్


*ఛందోభాషణం* అడిగిన వారు శ్రీ సింగీతం నర్సింహారావు గారు.

అవధాని పూరణ👇

1)

ప్రా:-అష్టకాల వారలనుమతినిచ్చిరా?

అవధాని:-

నేనె అష్టకాల నిశ్చయముగ

ప్రా:మాతృమూర్తివిజయ మాలనువేసెనా?

అవధాని:-తల్లిదండ్రినాకు ధైర్యమెపుడు


2)

ప్రా:- అవధానమనినభయమా?

అవధాని:-వ్యవధానములేనివిద్యయదిభయమిడునే?

ప్రా:-వివరమునడిగితివిద్యా!

అవధాని:-కవనమ్మున భావపుష్టి కలిగినచాలున్!


*పద్య అంత్యాక్షరీ* అడిగినవారుమాతృతుల్యులు కట్టాశ్యామలగారు

అవధాని పద్యం👇

'మన 'అక్షరాలతో

1)

మనపద్యమ్మేనాయిది

ఘనముగ ప్రవచించినారు కవితాద్యుతితోన్

వినదగుభావంబున్నది

మనముననే నతులుజేతు మాతానీకున్

2)

దివ్యమైనట్టి పద్యము సవ్యముగను

చెప్పియలరించివారింట చిప్పిలముగ

మిన్నభావాలసరళినిన్ దన్నుజేరి

కట్టశ్యామల మీరింక ఘనతనొంద!


*ఆశువు* అడిగినవారు నల్లా అశోక్ గారు పుత్రుని అవధానముచూచి కీ శే అష్టకాల వారి భావన

అవధానిపూరణ👇

చెప్పినమాటలువినడని

చప్పునభావించినేను సాహిత్యమునన్

గొప్పగపద్యము జెప్పగ

యెప్పుడుయబ్బిందొగాని యెరుగనునేనున్

2)సరస్వతీ శిశుమందిర్ లగూర్చి

వాణీవిద్యా నిలయాల్

శ్రేణులుగా నిలిచినంత శ్రేష్టంబవుగా

రాణింతురు విద్యార్థులు

ప్రాణంబులుబెట్టిచదువ ప్రత్యేకముగాన్


*అప్రస్తుతము* ప్రాసంగముచేసినవారు జబర్దస్త్ లక్ష్మీకిరణ్ గారు 

ప్రశ్నలు:-


అశ్వము+గుఱ్ఱము ఏమౌతుంది

సమా:- "పోనీ"లెండి... పోనీ అంటే ఆంగ్లంలో గుఱ్ఱము పిల్ల కదా...లేదా అక్రమ సంబంధము అవుతుంది..ఎందుకంటే ఒకటి సంస్కృత పదం ఒకటి తెలుగు పదం కాబట్టి దుష్ట సమాసం


ప్రశ్న: రావణాసురునికి పది తలలు కదా ఆయన ప్రక్కన తిరిగి ఎలా పడుకుంటాడు..


సమా: ఆయనకి పదికి మించి భార్యలు కూడా ఉంటారు..వారు చూసుకుంటారు లెండి..అయినా నేనే ఇక్కడ ఎనిమిది (పృచ్ఛకావళి) తలలతో తంటాలు బడుతున్న..ఇక దశ కంఠుడు బాధ మనకెందుకు లెండి


ప్రశ్న: వస్త్రాలయాలకు, దేవాలయాలకు కల పోలిక, 

సమా: రెండింటిలోనూ ఏదో ఒక రకంగా క్షవరం అవుతుంది


ప్రశ్న: మీకు K. రాఘవేంద్రరావు సినిమాలిష్టమా, లేక కె.విశ్వనాథ్ గారి సినిమాలిష్టమా..

సమా: మీరు ఉచితంగా చూపిస్తే ఏదైన O "K"


ప్రశ్న: మీకు బంగారం లాంటి భార్య ఉండగా ఇంకా పంకజాక్షి మీద ఇష్టం ఎందుకు


సమా: ఈ బంగారాన్ని నాకు ఇచ్చింది ఆ పంకజాక్షి నే కాబట్టి


ప్రశ్న:మా చిన్నప్పుడు ,సిద్దిపేట పందులకు, మెదక్ గాడిదలకు, గజవెల్ లీడర్లకు ఫేమస్ అనే వారు..ఇప్పుడు మా పిల్లలకు చెప్పాలంటే ఏమని చెప్పమంటారు..

సమా: మీరేం చెప్పక్కరలేదు..మిమ్మల్ని చూసి వాళ్లే ఒక నిర్ణయానికి వస్తారు లెండి.



కొన్ని అవధాని చమత్కార సమాధానాలు.



ప్రశంసా పద్యాలు:


అధ్యక్షులు మరుమాముల దత్తాత్రేయ శర్మ


ధ్యానావస్ధను ధారణాసహితమౌ ధారాళ పద్యంబులన్

యీనాడల్లితి వీవధానమున నీవెంతేని ధన్యుండవై

ప్రాణంబైయవధానవిద్యనిచటన్ ప్రత్యక్షమున్జేసితే! !

వాణిన్నిల్పిన మీదుతండ్రి వరసత్వంబౌ సుపుత్రాకృతిన్


శ్రీవిద్యాచరణంబులన్ వదలకన్ జిజ్ఞాసివధ్యాసివై

ప్రావీణ్యంబును పొందినావు కృతులన్ వాగ్వాదినీ సత్కృపన్

శ్రీవిద్యానిధి యష్టకాల గురువై చిన్మాధురిన్ పంచెగా

ఓ విద్యాచరణా!వధానకళలందుత్తీర్ణతన్ బొందుమా! !


అమ్మను వీణాపాణిగ

సమ్మతినిల్పిన వధాని జనకుని రీతిన్

నెమ్మది వాణిని గొలిచిన

పిమ్మట నవధానివైతి విద్యా చరణా!!

.. మరుమాముల దత్తన్న



బ్ర శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారి  అవధాన అరంగేట్రము విజయవంతమైన సందర్భంగా నా స్పందనపద్యాలు ల👏👏💐🌹


✍️సింగీతం నర్సింహారావు.

(1)

కమనీయమ్మగు శబ్దజాలములచే కైతల్విరాజిల్లెనే

హిమమున్బోలిన పద్యరాజములుమా హృద్యంబు మోదంబయెన్

రమణీయమ్మయె నంశపూరణకళా లాస్యప్రవాహ్లాదమై

నమతాంమీయవధాన విద్యకుసదానౌచిత్యమిద్దేస్సఖా

(2)

అందరు పండితోత్తముల కందిన ఈయవధావర్యులున్

ముందున నిల్చిపూరణలు మోదముగూర్చెను నిట్టి వేదికన్ 

విందును గొల్పెధీషణులు విజ్ఞుల మెచ్చిరి నీవధానమున్

సందడి సందడాయెనిట సాహితి లోకము సంతసించగన్

(3)

సత్వగుణమ్ముగల్గి,సరసాలవినమ్రత సత్తువాక్కులన్

సాత్విక తత్వవేత్తయయి సాధన చేసెడి శక్తియుక్తుడున్

తత్వ విచారశారదులు ధర్మ నిబద్ధులు జ్ఞానధీమతుల్

సాంత్వన మొందుమా చరణు సౌమ్యవచస్వి శుభాభినందనల్!

(4)

*అవధానపుపద్యములిట*

*నవనీతము,మధువు తీరునైవేద్యమిడెన్*

*నవభవితకు సందేశము*

*కవనమునను దెలిపెనష్టకాలరు నేడున్*



చరణ్ అన్నయ్యకు అభినందనలతో... 

💐💐💐💐


సదమల భక్తిభావమును చక్కనిధార చమత్కృతిన్ సదా 

పదసుమసౌరభమ్ములను పద్యపు మాలలు గూర్చి శారదా 

పదముల గొల్వ దీవెనలు వాసిగనిచ్చు : వధాన కేళినిన్ 

వదలక సాగిపొమ్ము తమ బాణిని వాణిని సంస్తుతించుచున్


                          పార్నంది లలితాకృష్ణ



తే.గీ.

అమ్మ దీవెన నొసగగా నెమ్మనమున

భువిని విద్యాచరణు పరి పూర్ణుడయ్యి

వేడ్కమీరవధానము విందు జేయ 

సిద్ధమైనాడు మెదకున సిద్ధుడగుచు...

శుభము గలుగాలి మీకింక శోభలలర.


వరుకోలు లక్ష్మయ్య 

సిద్దిపేట



తొలియవధానమించుకను తొట్రునుచూపక సాగునట్లుగా

వలసిన పద్య పాదములు వచ్చునొకింతయు జాగులేక మీ

తలపులు సుందరాకృతిని దాల్చిన శిల్పములౌను సత్కవీ!

సలలిత పద్యధారలు రసాద్భుతమౌనిక భారతీ కృపన్!


శాడ వీరారెడ్డి

ఉత్పల మాల 

 ఎన్ని భవాల పున్నెమొ? మహేశ్వరి దీవెన పొందినావు నీ

 కన్ని సుసాధ్యమౌను కద కమ్మని రాగము తోడ పద్యముల్

 చెన్నుగ సద్యస్ఫూర్తిగను చక్కని భావము గూర్చి, ధారతో

ప్రన్నని మాలలల్లితిరి పండిత రాముని దివ్య పుత్రుడా


నల్ల అశోక్

Thursday, October 1, 2026

అష్టకాల విద్యాచరణ్ 4వ అష్టావధాన పూరణలు

 23-8-26...ఆదివారం. ధర్మిష్ఠ గృహ సముదాయం మియాపూర్ లో


శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారి అష్టావధానం ..


సభాధ్యక్షులు& విశిష్ట అతిథి: దేవీ ఉపాసకులు బ్ర.శ్రీ చెప్పెల హరనాథ శర్మ గారు, మర్పడగ క్షేత్రం.

సభాసమన్వయం: శతావధాని శ్రీ అయితగోని వెంకటేశ్వర్లు గారు...


1.నిషిద్ధాక్షరి...తెలుగు భాష వైశిష్ట్యం (ప్రాశ్నికులు: అవధాని డా.శాస్త్రుల రఘుపతి గారు)

కం.

స(ర)త్య (భ)మ్మై  శ(త)బ్దంబుల్

నిత్యం (క)బౌ (వ) భా(వ)షగా (న)దె నేస్తంబౌచున్

ముత్యమ్ములవలె వెలుగుచు

కృత్యంబై యిలను తెలుగు గీర్వాణియనన్...!


సత్యమ్మై శబ్దంబుల్

నిత్యంబౌ భాష గాదె నేస్తంబౌచున్

ముత్యమ్ములవలె వెల్గుచు

కృత్యంబై యిలను తెలుగు గీర్వాణియనన్


2.సమస్య..(ప్రాశ్నికులు: అవధానిని డా.వేదాల గాయత్రి గారు)

*చినవాడే మము బ్రోచుగాత సతమున్ క్షేమంబులన్ గూర్చుచున్.!*


పూరణ:

మనమందున్ కడుభక్తి భావగరిమన్ మంత్రమ్ముగా నిల్పుచున్

ఘనమైనట్టి విశిష్ట యజ్ఞముల విజ్ఞానమ్ములన్ బంచుచున్

క్షణమైనన్ తననిష్ట వీడకమదిన్

కష్టమ్ములన్ చూడ వ

చ్చినవాడే మము బ్రోచుగాత సతమున్ క్షేమంబులన్ గూర్చుచున్.!


3..దత్తపది...భక్తి ,శక్తి ,ముక్తి, యుక్తి.. భక్తి సాధనము పండరి వారి సాహిత్య కృషి. (ప్రాశ్నికులు: అవధాని శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు)


మ.కో

శక్తి లేదనిచింత లేదుట శస్తమౌ పద సంపదల్

యుక్తితోసమకూర్చ జూచెడు యోగి పండరి కృష్ణుడే

ముక్తిమార్గములన్ని జూపగ ముక్తినాథుని కొల్చుచున్

భక్తి సాధన సల్పుచుండెడు పద్యసేద్యము నిత్యమున్...!


4..వర్ణన...అవధాని గారిని గూర్చి తండ్రి గారి ఆంతరంగం..(ప్రాశ్నికులు: అవధాని శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారు)

ఉ.

ఎప్పుడు వచ్చెనో చదువు నెప్పుడు వ్యాకరణమ్ము నేర్చెనో 

చప్పున పద్యమున్ చదువజాలడు పండితులేల మెత్తురో!

ముప్పును దెచ్చునో జనుల మోదమునందునొ నీ పరీక్షనున్

గొప్పగ దాటిపోవనటుల కూరిమి పంచుమ వాగధీశ్వరీ..!


5.చిత్రకవిత...శ్రీలలితాంబ ( ప్రాశ్నికులు: అవధాని శ్రీ బైరపనేని పోతురాజు గారు)

మ.

ఇలనేగాంచెడు రెండు పాదమ్మలనే నిష్టమ్ముగా గాంచితిన్

కలలన్ దీర్చెడి ప్రేమచక్షువులలో  కారుణ్యమున్ గాంచితిన్

జలజాతాస్యము పూర్ణచంద్ర సమమున్ శస్తమ్ముగా గాంచితిన్

లలితాంబన్ మనసార గాంచితిని సల్లాపంబులన్ సల్పుచున్..!


6.ఆశువులు. (ప్రాశ్నికులు: కవి పండితులు, శ్రీ పి. ఎల్.నాగేశ్వర రావు గారు)

1.ఉత్తర గోగ్రహణమునకు సంబంధించి ఏదైన 


ఉత్తర గోగ్రహణంబున

సత్తువ చూపించి నీల్గి శస్త్రాలుగనన్

చిత్తంబున భయము నిలువ

తత్తరపడి ఉత్తరుండు ధరపై వణకెన్..!


2.ఇంట్లో వారికి ఇబ్బంది లేకుండా పద్య సాధనకు మార్గం

 

ఉద్యోగంబుకు సరిపడు

విద్యను నేర్పించవలయు విధిగా సతికిన్

సద్యఃస్ఫూర్తిన పద్యము

ఉద్యమముగ వ్రాయవచ్చు నుత్సాహముతో...!


పద్య అంత్యాక్షరి ప్రాశ్నికులు: కవి పండితులు శ్రీ నమిలికొండ విజయ భాస్కర్ గారు

అప్రస్తుత ప్రాశ్నికులు: కవయిత్రి శ్రీమతి శనిగల మానసగారు




Web video 01: https://youtu.be/IdEkaBuw7Do?si=seBC3t0SdhfPE167 

Web video 02: https://youtu.be/wse4OUZXDmk?si=wlKOhvX1rpDVyME8 

Web video 03: https://youtu.be/P6U8ioKLFZc?si=AA9NrUim1nLzQ3Km 

Web video 04: https://youtu.be/0OEoL63ay5Y?si=YMdR-hHIUfULeUEl 

Web video 05: https://youtu.be/a4SZ8-daGsU?si=Aff7i_eB9M5DxiJP 

Web video 06: https://youtube.com/shorts/NolgntvnWRM?si=6ff--OrSiQ0Px51G