Sunday, July 27, 2014

రానున్న జీవితం - Veenaapaani August'14 edition editorial first cut

మనం సహజంగా భయస్తులం. సంపద ఉన్నప్పుడు  చోరభయం. మంచి చేసేప్పుడు  చెడు గూర్చి భయం. చెడుకి కూడా మంచి అంటే భయం. ఆనందానికి  దుఃఖమనే  భయం. తప్పుకు శిక్ష అనే భయమ్. ప్రేమకి ద్వేషం అంటే భయం. భయమున్నా మనకు  సంపాదించడం కోసం తాపత్రయంఆనందం పై ఆశ, మంచికై ఆలోచన, దొరక్కుండా తప్పు చేయాలన్న తపన, ప్రేమలో మునిగిపోవాలన్న కోరికా తగ్గలేదు, తగ్గదు కూడా.. అది మానవుల జన్మహక్కు. అలాగే పాపం చెయ్యాలంటే దైవభీతి. అయినా పాపం చెయ్యగలిగే అన్ని అవకాశాలను చాలా సామర్థ్యం తో వినియోగించుకుంటాం. దైవాన్ని భక్తి పేరుతో ప్రసన్నం చేసుకునే బదులు కానుకల ద్వారా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు విజయం కూడా సాధిస్తాం. చేసిన పాపాలకు ఆలస్యపు రుసుము చెల్లించి తప్పించుకున్నామని విర్రవీగుతాం.

దైవం మనలో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక ప్రయోజనం కొరకు ఈ ప్రకృతి లోనికి పంపించిన ఒక ఉత్కృష్ట శక్తి.  కాని మనం ఆ శక్తిని గుర్తించకుండా ఆ ప్రకృతిని అవహేళన చేస్తున్నాం. ఆ దైవం మనకొరకు సృష్టించిన ఎన్నో సహజమైన వనరులని నాశనం చేసి మనం కృత్రిమంగా జీవిస్తున్నాము. ఆ బ్రతుకు పోరాటంలో మనకు అత్యంత అపురూపమైన బిడ్డలను కూడా అద్దె తల్లుల అండలో వదిలి మనం కేవలం వారాంతపు తల్లి తండ్రులమయ్యి అక్కడికే అలసిపోతున్నాం. దైవారాధనభక్తీ ఒక ఖరీదైన వైద్యంగా మారిపోయాయి. మనం దేవుడి గాలిగోపురం కన్నా ఎత్తుగా బ్రతుకుతూ భూమి గర్భాన్ని చీలుస్తూ అన్నకట్టలు, ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ, కూలుస్తూ, మళ్లీ నిర్మిస్తూ, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం. అందుకే మనకు ఆ విశ్వామిత్ర భంగం తప్పదేమో అనిపిస్తున్నది. దైవాన్ని మనం భక్తి  అనే మాయలో పడవేసి అదే అ దేవుడి బలహీనత అని తేల్చిన ప్రతిసారీ  ఆ దైవం మన బలహీతనల పైన దెబ్బ కొడుతుంది. అప్పుడే ప్రకృతి ఆ పంచభూతాల సాక్షిగా  తన అస్తిత్వాన్ని కసితీరా ప్రదర్శిస్తుంది. అది ఉగ్ర నదీ రూపంలోనైతేనేమి, లేదా ఉరికే రైలు రూపంలోనైతే నేమిగాక, మనం సర్వస్వం అనుకున్న మన పేగులు దేవుడు మొండి కత్తితో కోసి పడేస్తున్నాడు. ఆ బాల సరస్వతుల మృత్యు ఘోషని హారతులుగా, లేత రక్త మాంసాలను నైవేద్యంగా స్వయం కైంకర్యం చేసేసుకుంటున్నాడు. మన గుండెల బరువు పెంచి ప్రకృతిపై బరువు తగ్గిస్తున్నాడు. ఇవే కాక మనం గొప్పగా నిర్మించుకున్న ఇంధన గొట్టాలు, ఎత్తుగా ఎగరేసిన గాలి విమానాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తున్నాయి. దీనికి పరిష్కారమే లేదా. రానున్న జీవితంలో  ఇంకా ఎన్ని పెను మార్పులో.. ఇంకా ఎన్ని గుండె కోతలో.. తలుచుకుంటేనే ఎంతో భయం వేస్తోంది. ఎందుకంటే మనం సహజంగా భయస్తులం కదా. అయినా మనిషి మారడు అతని కాంక్ష తీరదు.
దేవా, నేను ఈ మానవులందరి తరఫున నిన్ను కోరుకునే దొక్కటే. మా మనసులు మార్చే మంత్రదండమై వచ్చి మమ్మల్ని ఈ కలిదోష పాప పంకిలం నుండి విముక్తులను చేయు స్వామీ!! 

యదా యదా హి ధర్మస్యా , గ్లానిర్ భవతి భారత:
అభ్యుత్థనమధర్మ్యస్య తదాత్మానం  సృజామ్యహం

Monday, July 15, 2013

మౌన సాక్షివా? - July'13 editorial veenapaani first cut

మౌన సాక్షివా?

భారతదేశం ధర్మభూమి. కర్మభూమి కూడా.. హిందువుల్ని నడిపిస్తున్న ఆ సనాతన ధర్మం ఎప్పుడు తప్పు దోవ పట్టినా ఆ పరమాత్ముడు తన అస్తిత్వాన్ని, శక్తిని మనకు రుచి చూపిస్తాడు. కాని ప్రతి సారి తప్పు చేసిన వారే  శిక్షించబడతారా  అంటే చెప్పడం కష్టం. ఆ భగవంతుడి లెఖ్క మానవ మాత్రులమైన మనకు అర్థం కాదు. అవి ప్రకృతి వైపరిత్యాలుగా మనకు అనిపించినా అవి మనకు ఎన్నో బాధల్ని, గాధల్నీ మిగులుస్తాయి. మనల్ని కొన్ని సార్లు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రభావితం చేస్తాయి . ఇలాంటి ఎన్ని వేదాంత పరమైన సంజాయిషీలు చెప్పుకున్నా మొన్న జరిగిన  కేదార నాథ్ ఘటన మాత్రం ప్రతి మానవ మాత్రుడు జీర్ణించుకోలేని, ఒక్కసారి ఉలిక్కిపడ్డ సంఘటన. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయుల్ని, జీవనాధారాన్ని కోల్పోయిన హృదయ విదార ఘటన.    ప్రకృతి కన్నెర్ర చేసి తన ప్రతాపం తో ప్రళయం సృష్టిస్తే, మనమంతా చేష్టలుడిగి పోయి దిగ్భ్రాంతి చెందాం. టీవీల్లో సినిమా చూచినట్టు చూసి, రెండు రోజుల్లో మరిచిపోయాo. మరికొంతమందిమైతే ఇలాంటి  తీర్థ యాత్రలు ఇక జీవితంలో చేయకూడదని నిర్ణయం కూడా  తీసేసుకున్నాం. ఇంకా ఎందరో, ఇది జరిగింది కేదార నాథ్ లో కదా, మన అమరనాథ్ యాత్ర కి ఈ ఇబ్బంది ఉండదులే అని ముందుకు సాగిపోయారు. వర్షాలు నెల రోజుల ముందే వచ్చాయో, లేదా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నట్టు ఏదో ఒక  జలవిద్యుత్తు సంస్థ వారు  అక్కడి ప్రజల నమ్మకానికి వ్యతిరేకంగా తలపెట్టిన ఆనకట్ట కట్టడానికి అక్కడి  ధారీ దేవి అమ్మవారి  (కాళీ మాత స్వరూపమని ఉవాచ )  దేవాలయ స్థల మార్పిడి వ్యవహారం  వల్ల ప్రాప్తించిన దోషం చేతనైతేనేమీ, అక్రమంగా నదీ పరివాహకంలో కట్టిన కట్టడాల వల్లనైతేనేమీ   జరగకూడని ఘోరం జరిగిపోయింది, తీరని జన నష్టం, ఆస్తి నష్టం జరిగినది. ఉత్తరాఖండ్  ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయినది. గంగమ్మ తల్లి వేయి అమాయక ప్రాణాల  సాక్షిగా తన ప్రక్షాళన చెసుకున్నది. ఎన్నో శవాలు సగం కాలి కాశిలో తనలో కలవకుండానే తనే తన కర్తవ్యాన్ని కసి తీరా తీర్చుకున్నది. ఎంతోమందికి జీవన్ముక్తి ని ప్రసాదించింది.  సాక్షాత్తు ఆ జగద్గురు ఆది శంకరులవారు కైవల్యప్రాప్తి పొందిన కేదారనాథ్ లో మోక్షం పొందారన్న ఒక్క ఓదార్పు తప్ప మనం వేరే ఇంకా ఏమి ఇవ్వగలం?. మహా అయితే ఒక రోజు జీతం ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్లు చేతులు దులుపుకోవడం తప్ప. అన్నట్టు, ధారిదేవి దేవి భాగవతంలో చెప్పిన నూటా ఎనిమిది శక్తిపీఠములలో ముఖ్యమైన పీఠమట. అలకానంద నది మధ్య ద్వీపంలో కొలువున్న ఈ శక్తి సాక్షాత్తు ఆ కాళీ స్వరూపమని, ఈ అమ్మవారు, ఒక రోజులో బాలికా, యవ్వనవతిగా, ముదుసలి ముత్తైదువ స్వరూపంలో దర్శనం ఇస్తుందని స్థలపురాణం. ఈ ద్వీపంపై ఉన్న దేవాలయంలో, దేవతామూర్తి కేవలం శరీర పైభాగం మాత్రమే విగ్రహంగా ఉందట. మిగతా భాగం రుద్ర ప్రయాగ్ జిల్లా లోని కాళీమఠములో శ్రీ చక్ర రూపంలో ఆ జగద్గురు శంకర భగవద్పాదులు ప్రతిష్టించారని స్థానికులు చెపుతారు. ధారీ దేవి చార్ ధామ్ ల క్షేత్ర రక్షకురాలని, ఆనకట్ట కట్టడం వల్ల ఈ దేవాలయం ముంపుకు గురయ్యే అవకాశం ఉందని ఆ అమ్మవారి విగ్రహాన్ని మూలస్థానం నుంచి కదిలించే ప్రయత్నం చేయడంవల్ల నే  ఈ విపత్తు సంభవించిందని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఏది ఏమైనా ఆ పరమేశ్వరుడి  పుణ్యభూమి మరుభూమిని తలిపించింది. అ శివుడు మాత్రం గుళ్ళో చెక్కుచెదరకుండా మౌనసాక్షిగా యోగముద్రలో ఉండి పోయాడు. ఎంతైనా స్మశానమే శివుడి వాసం కదా. 1882 లో కూడా అప్పటి రాజు ఇలాంటి ప్రయత్నమే ఏదో చేస్తే, సరిగ్గా ఇలానే వరద ప్రళయం వచ్చిందని చెపుతున్నారు. ప్రతి ఏటా కొన్ని లక్షలమంది భక్తులు దర్శించుకునే చార్ ధామ్ యాత్ర ఈ సారి అందరికి చెడు జ్ఞాపకాలనే మిగిల్చినది. ఏమైనా భక్తులు కూడా తీర్తయత్రలా కాకుండా విహారయత్రాలుగా వీటిని భావించడం కూడా ఒక రకంగా విచారకరమేఇలా పుణ్యక్షేత్రాలు కూడా అభద్రతకి మారు పేరుగా మారిపోవడం నిజంగా శోచనీయం. అది ఇలాంటి విపత్తుల వల్ల కావచ్చు లేదా తీవ్రవాదుల విపరీత ధోరణుల వల్ల కావచ్చు.  ఒక స్వామి నారాయణ్ దేవాలయంపై దాడి, షిర్డిసాయి ప్రాంగణంలో బాంబు పేలుడు, ఈమధ్య జరిగిన బుద్ధగయలోని బాంబు పేలుళ్లు, ఎవైన, భక్తులు దైవదర్శనానికి కూడా భయంగా వెళ్ళాల్సి వస్తోంది. అన్నింటికీ మన హైదరాబాద్ లోనే మూలాలు. అన్నట్టు ఆ జలవిద్యుత్తు సంస్థ ప్రధానకార్యాలయం కూడా మన హైదరాబాదే నట. మనం అన్నింటా ఘన చరిత్ర గలిగినవాళ్ళం గదూ.
ఓ స్వామీ ఎందుకిలా జరుగుతుంది?. పవిత్రస్థలాల్లో మనుష్యుల అపవిత్ర ప్రవర్తన కారణంగా చూపుతావా?. అహింస పరమోధర్మ:అన్న  బుద్దుడి అనునాయులు, భూమిపై పాకే, జీవం ఉన్న ప్రతిజీవిని తింటున్నారు కాబట్టి అని సాకు చూపుతావా?. నేను పులితోలు కప్పుకుని, తిరిపెమునెత్తుకుని జీవిస్తే, మీరంతా జల్సాలు చేస్తూ, నాగరికత పేరుతో,నా యాగి చేస్తున్నామని సమాధానపరుస్తావా?, అయినా నాకెందుకులే, నన్ను నమ్మే భక్తులు నాకు ఎలాగు ఉన్నారని మా రాజకీయ నాయకుల లాగ, నీ పని నీవు చేసుకుపోతావా?. నీవు మౌనసాక్షివా, లేక మనసాక్షివైతావా?. స్వామీ మళ్లీ , నీ వెండి కొండని వదిలి దివినుండి భువికి దిగిరావాల్సిన సమయం అసన్నమైంది. నీ త్రిశూలంతో మా అరిషడ్వర్గాలను వధించి కనీసం మా రాబోయే తరాలనైనా భక్తీ,ముక్తి మార్గం వైపు పయనించేటట్టు వరం ఇవ్వవూ!!.

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః


---::-----

Thursday, May 16, 2013

వందే జగద్గురుo


వందే జగద్గురుo

    సాక్షాత్తు   పరమశివుని అంశావతారంగా భావింపబడే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు  స్థాపించిన నాలుగు ముఖ్యమైన  ఆమ్నేయ శంకర పీఠములు  తూర్పుభారతంలో గోవర్ధన పీఠము (ప్రజ్ఞానం బ్రహ్మ:), దక్షిణాన శృంగేరీ  శారదా పీఠము ( అహం బ్రహ్మాస్మి), పశ్చిమాన ద్వారక పీఠము ( తత్వమసి:) మరియు ఉత్తరాన జోషిమట్  పీఠము (అయమాత్మా బ్రహ్మ:). వీటితో పాటు  అతి ముఖ్యమైనది  కంచి కామకోటీ  పీఠము.   ఎనిమిదేళ్ళ వయసులో సన్యాసాన్ని స్వీకరించిన జగద్గురు ఆది శంకరులు కాలినడకన సంపూర్ణ భారత యాత్రానంతరం ఆ కామాక్షీదేవి సేవలో కంచిలోనే తన జీవితకాలాన్ని గడిపారట. కేవలం తన 32 వ వయస్సులోనే కేదారనాథ్ వద్ద శివకైవల్యం పొందారని కూడా చెపుతారు.  సుమారు  2500 సంవత్సరాల క్రితం (క్రీ. పూ. 482) స్థాపింపపడ్డ  ఈ పీఠము, ఇప్పటి వరకు  ఆచార్య పరంపరలో 69 జగద్ గురువులచే అవిఘ్నంగా  సేవించబడ్డ బహుశా ఏకైక పీఠము ఈ కంచి కామకోటి పీఠము. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించిన శంకర భగవత్పాదులు హిందూ మత తత్వానికి ఉన్నత స్థానాన్ని కల్పించిన మహానుభావుడు. అద్వైత వేదాంతాన్ని ప్రబొధించినా, ఉపనిషద్ సారాన్ని మనకందరికీ అందించిన ఈ మహానుభావుడు పుట్టినది, శుక్ల పంచమివైశాఖ మాసము, ఆనందనామ సంవత్సరం. గురు పౌర్ణమి కూడా ఈ రోజు ని జరుపుకుంటారు. బ్రహ్మసూత్ర భాష్యం, భజగోవిందం, శ్రీ శంకరులు మానవాళికి  అందించిన ముక్తి పథాలు. శాస్త్రం,యుక్తి, అనుభవం, కర్మ ఆధారంగా అద్వైత వేదాంతం ఆజన్మాంతం మానవుడిని  ఉన్నతమైన జీవన శైలికి ఒక మార్గాన్ని అన్వేషింప చేసే ఒక ఉపకరం.
శ్రీ శంకరాచార్యుల వారి జీవన క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం  స్వామివారి కైలాస యాత్ర. స్వామి తన యోగ శక్తి తో ఆదిదంపతుల దివ్యదర్శనం శివపదాది కేశాంత స్త్రోత్రం, శివకేశాది పదాంత స్త్రోత్రంతో శివపార్వతులను ప్రసన్నం చేసుకుంటే, స్వయంగా ఆ పరమ  శివుడే తాళ పత్ర్రాలపై రచించిన "సౌందర్యలహరి" ఇచ్చిన హృద్యమైన సన్నివేశం. ఆ పరమశివుడు ఆచార్యుల వారికి పంచ స్పటిక లింగాలతో కూడా ఆశీర్వదించేరుట. అవే శ్రీ శంకర భగవత్పాదుల వారు స్వయంగా ముక్తి లింగం కేదార్ నాథ్ లో, వర లింగం ప్రస్తుతం నేపాల్ లో ఉన్న నీలకంఠ క్షేత్రంలో, భోగ లింగం శృంగేరీ శారదా పీఠంలో, మరియు మోక్ష లింగంచిదంబరం తమిళనాడు లోని  నటరాజ స్వామి క్షేత్రం లో ప్రతిష్టించి, యోగ లింగాన్ని కంచి లో ప్రతిష్టించారు. 

ఆది శంకరులవారు ఆ పరమశివుడి అవతారమైతే, సాక్షాత్తు ఆ జగద్గురువు శంకర భగవద్పాదుల అవతారమే 68 పీఠదిపతి శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి అని చెపుతారు. సుమారు వందేళ్ళు జీవించిన(1894-1994) ఈ జగద్గురు, 67వ స్వామి శ్రీ మహాదేవేంద్ర సరస్వతి స్వామి పీతాదిపత్యం స్వీకరించిన ఏడు  రోజుల్లోనే శివకైవల్యం పొందడంతో కేవలం పదమూడేళ్ళ వయసులోనే పీటాదిపత్యం స్వీకరించి, భారతదేశమంతా కాలి నడకన మరియు సాంప్రదాయ పల్లకిలోనే యాత్ర సాగించారు. నడిచే దేవుడు, మహాస్వామి అని ప్రఖ్యాతి పొందారు. విదేశీయులకు సైతం మన హిందూ ధర్మం ప్రచారం చేసి సమ్మోహితులను చేసిన పరమ యోగి ఈ మహస్వామి. స్వతంత్ర సమరం లో కూడా ప్రత్యక్షంగా విదేశీ వస్తు బహిష్కరణ లో పాల్గొన్న స్వామిజి, అద్వైత తత్వానికి విదేశాల్లో సైతం విస్తృత ఆదరణని  కల్పించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు తన డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథంలో ఆది శంకరుల వారిని  భారతదేశం పొందిన ఒక అద్భుతమైన మహాశక్తిగా వర్ణిస్తే, అవి అక్షరాల ఈ మహాస్వామిని కూడా నిర్వచిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ  లేదు.  మహాస్వామి కాలంలోనే కంచి పీఠం విశేషంగా ఆభివృద్ధి చెందింది. 

తరువాత స్వామి 69వ, ప్రస్తుత  పీటాధిపతి శ్రీ శ్రీ జగద్గురు జయేంద్ర  సరస్వతీ శ్రీపాద స్వామివారు.
శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి తన ధర్మ ప్రచారంతో అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్శించారు. ఎన్నో ధార్మిక, సాంఘిక సంస్కరణలను చేపట్టి, విద్య, వైద్య, వైజ్ఞానిక రంగం, ఎన్నో దేవాలయాల పునరుద్ధరణలో ప్రత్యక్ష్య మార్పులకు కారణ భూతులయ్యారు. తన 63వ ఏట మానస సరోవర, మరియు కైలాశ్ గిరి  యాత్ర చేసిన ఏకైక స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. విశేష ధర్మ పరంపరతో అలరాడే కంచి కామకోటి పీఠం జగద్గురువులు తమ 60వ పీతాదిపత్య వార్షికోత్సవం మన ఆంధ్రప్రదేశ్లో, మెదక్ జిల్లా లో జరగడం మన అందరి పూర్వ జన్మ సుకృతం. అందునా స్వయంగా వారిచేతులమీదుగా జరిగిన ఆ స్వర్ణకంకణధారణ, అది ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించిన భక్తుల జీవితాలు ధన్యం,ధన్యం,ధన్యం. 

ధర్మో రక్షతి రక్షితః

అవినయం అపనాయా, విష్ణో అమయ మనః
సమయ విషయ మృగ తృష్ట్నాం: భూతదయం విస్తారయ సంసార సాగరాతః

Saturday, April 14, 2012

దైవం మానుష రూపేణ....

దైవం మానుష రూపేణ....


మనం ఏదో అవసరంలో ఉంటాం. అనుకోకుండా ఎవరో సహాయం చేస్తారు. మనం ఆ మనిషి  దేవుడులా వచ్చి సాయం చేసాడని  మన కృతజ్ఞతలు తెలియచేస్తాం. మనకు ఏమాత్రం సంబంధం లేని వారు ఎందుకు అలా సహాయం చేసారో ఆలోచిస్తే ఎన్నో అర్థాలు స్పురిస్తాయి. అది మనం ఎప్పుడో ఎవరికో మనం చేసిన  సాయం వల్లో మనకీ సాయం దొరికిందని సరిపుచ్చుకుంటాం.  లేదంటే పూర్వ జన్మ సుకృతం అని సంతృప్తి చెందుతాం.  చాల మందికి రక రకాల నమ్మకాలుంటాయి. చేసే ప్రతి పనిలో కొందరి మాటను దైవంగా భావిస్తారు.  ఎందుకంటే కారణం చెప్పలేరు. అది కేవలం నమ్మకం అంతే. అలాటి నమ్మకమే దేవుడిపై మనిషుండే విశ్వాసం. ఆ నమ్మకమే మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఆ దైవభీతే మనిషిని నీతిగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆ నమ్మకమే సామన్యునితో  అద్భుతాలు చేయిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. కొందరు ఆ అదృష్టాన్ని అందుకుని అందలాలు ఎక్కితే మరి కొందరు ఆ విశ్వాసాన్ని భక్తిగా మార్చుకుని తమ జీవితాల్ని దైవసేవకు అంకితం చేసుకుని పునీతులవుతారు. మహర్షులవుతారు.


 ఏది ఏమైనా ఈ సృష్టిలో ప్రతి మానవుడి  ప్రథమ కర్తవ్యం తన  చుట్టూ ఉన్న మంచిని గుర్తించడం అది మనకు ఎంత శుభాన్ని కలిగిస్తున్నదో తెలుసుకోవడం. అది ఈ ప్రకృతి కావచ్చు, మనల్ని కాపాడే మన పెంపుడు జంతువులు కావచ్చు. అనుక్షణం మనల్ని వెన్నంటి ఉండి మన బాగు కోరుకునే  మన  జీవితభాగస్వామి కావచ్చు. నిరంతరం మన అభివృద్ధిని కాంక్షించే మన స్నేహితులు కావచ్చు, కేవలం మీరు దానం చేసే ఒక్క రూపాయి కి మీకు  వందేళ్ళ ఆయురారోగ్యాలు  కోరే మీ వీధి చివరి బిచ్చగాడు కావచ్చు. ప్రతి క్షణం మీ పని తన పనిగా చేసే మీ పనివాడు కావచ్చు. వీరంతా ఆ దేవుని స్వరూపాలే. నీవు నమ్మిన ఆ దేవుడు పంపిన దూతలే. ప్రతి ప్రాణి మరొక ప్రాణికి ఆ దైవం పంపిన సేవకులే. అవరసానికి అంది వచ్చే ఆ దేవుడి ప్రతినిధులే. సర్వం బ్రహ్మ మాయం అంటే ఇంకేదో కాదు ఇదేనేమో అని నా అభిప్రాయం. మనం చేసే మంచికి ఆనందపు ప్రసాదం, చెడుకు బాధల శటారిలు. జమాఖర్చు అన్ని సమానం. మనమంతా ఒకరికి ఒకరు దేవుడి స్వరూపాలే కాని, ఎవరికీ వారు మాత్రం కేవలం మానవ మాత్రులన్నవిషయాన్ని మనం మరిచిపోగూడదు. సాక్షాత్తు ఆ  దైవం మానవుడి అవతారం ఎత్తినపుడు మనిషిగా అన్ని విధులు నిర్వహించాడు, అన్ని కష్టాలు అనుభవించాడు. చివరకు చెడుపై విజయం సాధించాడు. దేవుడు ఈ లోక కల్యాణానికి ఎన్నో అవతారాలెత్తాడు. ఎందఱో మహానుభావుల రూపంలో ఈ మానవుల జీవితాల్ని ప్రభివితం చేసారు. అది శంకరచార్యుడైన, సాయిబాబా అయినా,  గౌతమ బుద్దుడైనా, వారంతా సామాన్యులుగా జన్మించి అసామాన్యులుగా జీవితాల్ని మలుచుకున్నవారు. వారి నందరిని  మనం దైవంగా ఆరాధించాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మన చుట్టూ అలంటి మహానుభావులెందరో.     


నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, లోకంలోని ఈ వికలాంగులు ఈ జీవ రాసులందరి తరఫున  వారు చేసిన పాపాలన్నిటికి తాము బాధ్యత  తీసుకుని, వారు ఈ అన్గావైకల్యమనే శిక్షను అందరి తరఫునా అనుభావిస్తునారేమో అని. అదే నిజమైతే, వారి విషయంలో మన బాధ్యత ఇంకా పెరగడం లేదా. వారిలో మనకు దైవం కనిపించడం లేదా? దేవుడికోసం చేసే ఎన్నో ఖర్చుల్లో కొంతైనా ఈ దైవస్వరూపాల కు చెందడంలో ధర్మం లేదా? మానవసేవ కూడా  మాధవ  సేవేనన్న గొప్ప విషయం మనకు తెలియనిది కాదు కదా. 


దైవం ప్రతిసారి, ఒకే రూపంలో ఉండకపోవచ్చు. కాని అది  అనునిత్యం అనేక విధాలుగా, మనల్ని కాపాడే అమోఘమైన ఒక శక్తి. అది దైవాన్ని పరిపూర్ణంగా, అనియమితంగా నమ్మినవారికి అడుగడుగునా సాక్షాత్కరిస్తాడు. ప్రతి మనిషిలో దర్శనమిస్తాడు. అందుకే మనం చేసే ప్రతి పనిలో మనం దైవాన్ని చూడాలి. మనం కలిసే ప్రతి వ్యక్తిలోని ఆ మహాశక్తికి  సాస్త్రాంగ నమస్కారం చేయగలగాలి. దైవం మనకు ఈరోజు, ఎరూపంలోనైనా  దర్శనం ఇవ్వవచ్చు. ఆ అపురూప ఘట్టాన్ని కోల్పోవద్దు. ఇదీ ఆ దేవుడిని కృపని పొందే మార్గమేనని గుర్తిద్దాం. జీవితాల్ని సాఫల్యం చేసుకుందాం. శుభస్య  శీఘ్రం.  

Monday, January 2, 2012

శరణా గతి - ఒక జీవన విధానం


శరణా గతిఒక జీవన విధానం  
నీ  జ్ఞానం పరిమితం. లోపభూయిష్టం. నీ సామర్థ్యం  అతి స్వల్పం.నీ జీవితం మరీ సూక్ష్మం. నీవు ఆలస్యాన్ని భరించలేవు. అందుకే నీకు పూర్తిగా అర్థం కాని విషయాలను కూడా నువ్వు సాధించాలని ప్రయత్నం చేస్తావు. ఘోర పరాజయాన్ని పొందుతావు. ఎంతో ఆలస్యంగా పరిస్థితిని అర్థం చేసుకుంటావు. ఫలితాన్ని తప్పించుకొనుటకు ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తావు. అవి ఎంత దూరమో, అనుభవించడం ఎంత కష్టమో తెలుసుకునే లోపే జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. నీ బాధ్యతల్ని నీవు నిర్వర్తించలేదు. సంఘ నియమాల్ని పాటించలేదు. ఎవరి అంచనాలను నీవు చేరలేదు.ఎవరి ఆశలు నీవు తీర్చలేదు. ఇప్పుడే ఈలోకంలోకి వచ్చ్నినట్టుంది.అప్పుడే జీవితపు చివరి మజిలి దగ్గరపడినట్టుంది.  స్థితిలో నీవు ఎవరిని తలుచుకుంటావు?. ఎవరు నీ సమస్యకు సమాధానం చెపుతారు?. అప్పుడు కేవలం నీకున్న ఒకే ఒక్క ఉపాయం ఏది?.

అదే  అన్ని లోకాలను రక్షించే  ఒకే ఒక్క శక్తి. నీకు అండగా నిలుస్తుంది.   అదే నీకు సర్వస్వం అవుతుంది.  శక్తికి నిన్ను నువ్వు సమర్పించుకో.  శక్తే భగవంతుడు. నీ బాధలన్ని తీర్చే బాధ్యత తీసుకున్న పరమ శక్తి. తన పంచాంగాలతో నిన్ను రక్షించే మహా శక్తి. ఇప్పుడు నువ్వు  భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రుడివి. ఎంతో దయగల  సౌందర్యవంతుడు   లోకం లోని అన్ని కష్టాలనుండి నిన్ను మానసికంగా దూరం చేసి నీకు ఆనందపు పారవశ్యాన్ని పొందేట్టు చేస్తాడు. నిన్ను  ఐహిక బంధాలనుండి విముక్తున్ని చేస్తాడు. అంతం లేని అవరోధాల బాధల్ని పటాపంచలు చేస్తాడు. తనలో ఐక్యం చేసుకుంటాడు. తన ఆనందాన్ని నీదిగా చేస్తాడు. నీతో పసి పాపవుతాడు. సర్వం నీవు తనలో మమేకమవుతావు. సంపూర్ణ అనుభవాన్ని ఆనందాన్ని పొందుతావు. అదే శరణాగతి. నీవు దక్క  వేరే లోకం లేదనే తాదాత్మ్య స్థితి. అక్కడ కన్నీళ్లు లేవు. గాయాలు లేవు. కుట్రలు కుతంత్రాలకు స్థానం లేదు. సర్వం బ్రహ్మ మయం. ఇదే భగవద్గీత శ్లోక సారం. ఇదే  అత్యంత ఉన్నతమైన శ్లోకం. 
"సర్వధర్మ పరిత్యజ్య మమేకం శరణం వ్రజఅహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః"
మనిషికి శరణాగతి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం లాంటి అన్నిసాధనలకు ప్రత్యామ్నాయం. మానవ ధర్మాలు పాటించలేనప్పుడు మనిషి మనుగడ శరణాగతిలోనే.  అదే మనమనే స్వర్గం. అదే లేనప్పుడు మనిషికి కలిగే బాధలే నరకం. నిన్ను అన్ని ఐహిక పాపాల  నుండి  విముక్తున్ని చేసి మోక్ష సాధనకు భగవద్గీత చూపిన ఉత్తమమైన మార్గం. నిన్ను నీవు భగవంతుడికి అంకితం చేసుకుని నీ కర్మ నీవు పాటించు. అంతా తానై నిన్ను తనలో ఐక్యం చేసుకుంటాడు. అదే కైవల్య మార్గం. ఖురాన్ బైబిల్ కూడా ఇదే విషయం తు  తప్పకుండా చెపుతాయి. మతం ఏదైనా సారం ఒక్కటే. అదే ఏదో ఒక శక్తికి నిన్ను శరణాగతి చేస్తుంది. అదే ప్రతి జీవికి, జీవితానికి పరమార్థం.